FCI: తంజావూరులో.. దేశంలోనే తొలి ఆహార మ్యూజియం!

మనం తినే ఆహారానికి ముడి పదార్థాలు ఎక్కడి నుంచి లభిస్తాయో.. పట్టణాలు, నగరాల్లో ఉండే చిన్నారుల్లో చాలా మందికి తెలియదు. బియ్యం, గోధుమలు ఎక్కడ తయారవుతాయంటూ కొంతమంది

Updated : 17 Nov 2021 23:11 IST

తంజావూరు: మనం తినే ఆహారానికి ముడి పదార్థాలు ఎక్కడి నుంచి లభిస్తాయో.. పట్టణాలు, నగరాల్లో ఉండే చిన్నారుల్లో చాలా మందికి తెలియదు. బియ్యం, గోధుమలు ఎక్కడ తయారవుతాయంటూ కొంతమంది అమాయకంగా అడుగుతున్న సందర్భాలనూ మనం చూస్తుంటాం. పంటలు పండించే క్రమాన్ని సినిమాల్లో చూడటం తప్ప.. నేటి యువతరానికి రైతు కష్టం గురించి పెద్దగా తెలియదు. ఆహారోత్పత్తులు పొలం నుంచి మన ఇంటి వరకూ ఎలా చేరతాయో అందరికీ తెలియజేయడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమానికి బారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా.. దేశంలోనే తొలిసారిగా ఆహార మ్యూజియంను అందుబాటులోకి తెచ్చింది. 

తమిళనాడు తంజావూరులోని ఎఫ్‌సీఐ డివిజనల్‌ కార్యాలయం పక్కన.. దేశంలో తొలిసారిగా ఆహార మ్యూజియం ఏర్పాటు చేశారు. ఎఫ్‌సీఐ, బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్‌ టెక్నలాజికల్‌ మ్యూజియం సంయుక్తంగా దీనిని అందుబాటులోకి తెచ్చాయి. ఇక్కడి వివిధ విభాగాలు ఆహారంపై విజ్ఞానాన్ని పెంచేలా ఉన్నాయి. దేశంలో రైతు నుంచి ఎఫ్‌సీఐ గోదాముల వరకు జరిగే ఆహార సేకరణ ప్రక్రియను వర్చువల్ రియాలిటీ ద్వారా వీక్షించే సదుపాయం కల్పించారు. ఆహార నిల్వలపై ఆధునిక పద్ధతులను తెలుసుకునేందుకు వీలుగా ‘క్విజ్‌ జోన్‌’ ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక ఆహార నిల్వల కోసం ఎఫ్‌పీఐ సాగించిన ప్రయాణాన్ని డిజిటల్‌ గ్యాలరీల ద్వారా ప్రదర్శిస్తున్నారు. కాలానుగుణంగా మారుతూ వచ్చిన నిర్మాణ, వ్యవసాయ పద్ధతుల గురించి స్పష్టంగా తెలుసుకోవచ్చు. వ్యవసాయ నేపథ్యం, ఈ రంగంలో వచ్చిన మార్పుల్ని ప్రదర్శిస్తున్నారు. పూర్వ వ్యవసాయ పద్ధతుల్లో వాడిన పరికరాలు, వాటి ప్రత్యేకతల్ని నమూనాల ద్వారా చూపారు. ఆహారం కోసం వేట నుంచి వ్యవసాయం వైపు మొగ్గుచూపిన తీరును తెలుసుకోవచ్చు. పంటలను వేధించే వివిధ రకాల చీడపీడలు, వాటిని రైతులు ఎదుర్కొన్న తీరును వివరణాత్మకంగా ప్రదర్శిస్తున్నారు. 

దేశంలో పంటలు, ఉత్పత్తులపరంగా సాధించిన విజయాలు సాధారణమైనవేమీ కావు. వాటిని తెలుసుకోవడంతోపాటు తద్వారా వచ్చిన ఉత్తమ ఆహార ఉత్పత్తుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాల గురించి ఉత్పత్తులవారీగా తెలుసుకోవచ్చు. వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఉండే వంటలు.. వాటిలోని పోషకాల గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సెక్షన్‌లో డిజిటల్‌ తెరల్ని ఏర్పాటు చేశారు. పలు దేశాల్లో పండించే ఆహార ఉత్పత్తులు, వాటి ప్రయోజనాల్ని ఇక్కడ వివరించారు. పంట కోతల నుంచి ఎఫ్‌సీఐ గోదాములకు ధాన్యం తరలించే ప్రక్రియను పలు ఆకృతుల ద్వారా వివరిస్తున్నారు. రేషన్‌ దుకాణాల ద్వారా ఆహార ధాన్యాలు పేదలకు చేరే ప్రక్రియను సైతం తెలియజేస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని