Chenab Bridge: ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్‌ రైల్వే వంతెనపై తొలి ట్రయల్‌ రన్‌.. వీడియో

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్‌ రైల్వే వంతెనపై తొలి రైలు ట్రయల్‌ రన్‌ విజయవంతంగా నిర్వహించిన వీడియోను రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ షేర్‌ చేశారు.

Updated : 16 Jun 2024 20:29 IST

దిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్‌ రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ చారిత్రక వంతెనపై తొలి రైలు ట్రయల్‌ రన్‌ను విజయవవంతంగా నిర్వహించారు. చినాబ్‌ వంతెన దాటడంతో పాటు సంగల్డన్‌ నుంచి రియాసీ వరకు ఓ రైలు ఇంజిన్‌ను నడిపిన దృశ్యాలతో వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ షేర్‌ చేశారు.

మరోవైపు, చీనాబ్‌ నదిపై నిర్మించిన ఈ రైల్వేబ్రిడ్జి మీదుగా రాంబన్‌ నుంచి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఉత్తర రైల్వేశాఖ ఇప్పటికే వెల్లడించింది. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్‌-శ్రీనగర్‌- బారాముల్లా రైల్వే లింక్‌ (USBRL) ప్రాజెక్టులో భాగంగా చీనాబ్‌ వంతెనను నిర్మించారు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్‌ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్‌ రైల్వేవంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇందులో భాగంగా కొన్ని టన్నెళ్లు సైతం నిర్మించిన ఈ చారిత్రక వంతెన ఇకపై జమ్మూకశ్మీర్‌ వెళ్లే పర్యాటకులు తప్పక చూసి వచ్చే అందాల జాబితాలో చోటు దక్కించుకోనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని