ISRO: గగన్‌యాన్‌ అనుకున్న సమయానికేనా..?

కరోనా లాక్‌డౌన్‌తో పరిశ్రమలు మూసివేసిన వేళ.. మానవసహిత గగన్‌యాన్‌ను ఇస్రో అనుకున్న సమయానికే చేపడుతుందా లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. 2018లోనే గగన్‌యాన్ ప్రాజెక్టు వివరాలను ఇస్రో ప్రకటించినా....

Published : 29 Jun 2021 01:40 IST

బెంగళూరు: కరోనా లాక్‌డౌన్‌తో పరిశ్రమలు మూసివేసిన వేళ.. మానవసహిత గగన్‌యాన్‌ను ఇస్రో అనుకున్న సమయానికే చేపడుతుందా లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. 2018లోనే గగన్‌యాన్ ప్రాజెక్టు వివరాలను ఇస్రో ప్రకటించినా.. కరోనా మొదటి, రెండో దశలు గగన్‌యాన్‌పై తీవ్ర ప్రభావం చూపాయని బెంగళూరు కేంద్రంలోని అంతరిక్ష పరిశోధన సంస్థ అధికారులు తెలిపారు. మిషన్ కోసం ఉపయోగించే హార్డ్‌వేర్ డెలివరీ సమయాన్ని లాక్‌డౌన్లు ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్టు మూడు దశల ప్రయోగం కాగా.. మొదటి, రెండో దశల్లో మానవ రహిత మాడ్యూళ్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. 

మొదటి దశ ప్రయోగాన్ని ఈ ఏడాది డిసెంబరులో, రెండో దశను 2022-23లో చేపట్టేలా శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి అంటే.. వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు మానవసహిత అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎక్కువ గంటలు పని చేసైనా మిషన్‌ను అనుకున్న సమయానికి చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు మరో అధికారి తెలిపారు. గగన్‌యాన్‌పై లాక్‌డౌన్ ప్రభావం చూపిందని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ ఇటీవల వెల్లడించారు. అనుకున్న సమయానికే మిషన్‌ను పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్న ఆయన.. అలా జరుగుతుందని కచ్చితంగా చెప్పలేమన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే భారత్‌కు చెందిన నలుగురు వ్యోమగాములు రష్యాలో జెనెరిక్ స్పేస్‌ ఫ్లైట్‌ శిక్షణ తీసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని