Updated : 18 Oct 2021 16:52 IST

Jammu and Kashmir: కశ్మీర్‌ ఉగ్రవాదుల కొత్త వ్యూహం..!

 భారీగా పెరిగిన చిన్న ఆయుధాల వినియోగం..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

కశ్మీర్‌లో ఉగ్రవాదుల అరాచకం పెరిగిపోతోంది.. గత కొన్నేళ్లుగా భద్రతా దళాలు జల్లెడ పట్టి వారిని మట్టుబెట్టాయి. దీంతో ఉగ్రవాదులు వ్యూహం మార్చారు. ఇప్పుడు చిన్న ఆయుధాలతో పార్ట్‌టైమ్‌ ముష్కరులను దాడులకు పురిగొల్పుతున్నారు. వీరు వలసకూలీలే లక్ష్యంగా దాడులు చేసి తప్పించుకొంటున్నారు. దీనికితోడు స్థానిక ఉగ్రవాదుల మనోస్థైర్యం పెంచేందుకు పాక్‌ సైన్యంలోని అత్యున్నత కమాండోలు నేరుగా శిక్షణ ఇవ్వడం లేదా కశ్మీర్‌లో దాడుల్లో పాల్గొనడం వంటివి చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. 

ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకొని వచ్చిన వారిపై ఉగ్రవాదులు గురిపెడుతున్నారు. ఆదివారం మరో ఇద్దరు వలస కార్మికుల ప్రాణాలు బలిగొన్నారు. దీంతో ఈ నెలలో అమాయకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడుల్లో మరణించిన పౌరుల సంఖ్య 11కు చేరింది. కుల్గాంలోని వానిపోహ్‌ వద్ద కూలీలపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు  జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు స్థానికేతరులు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి. అంతకు ముందు కశ్మీర్‌ లోయలోని శ్రీనగర్‌లో పానీపూరి అమ్ముకుంటూ జీవనం సాగించే అరబింద్‌ కుమార్‌ షా (బిహార్‌), పుల్వామాలో సిరాజ్‌ అహ్మద్‌ అనే కార్పెంటర్‌ (ఉత్తరప్రదేశ్‌)ను  కాల్చి చంపారు. ఇప్పటి వరకు మరణించిన వారిలో ఐదుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారు.

పౌరులు, కశ్మీరీ మైనార్టీలపై ఉగ్రవాదులు గురిపెట్టారని గుర్తించిన వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమై జమ్ము కశ్మీర్‌లో 900  మంది ఉగ్ర సానుభూతిపరులను అదుపులోకి తీసుకొన్నాయి. అంతేకాదు మొత్తం 9 ఎన్‌కౌంటర్లు చేపట్టి 13 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. గత 24 గంటల్లో శ్రీనగర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఐజీ విజయ్‌కుమార్‌ తెలిపారు. 

అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ వెనక పాక్‌ కమాండోలు..

పదిహేనేళ్ల కాలంలో కనీవినీ ఎరుగని స్థాయిలో పూంచ్‌ జిల్లాలోని పీర్‌పంజాల్‌ రేంజిలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అక్టోబర్‌ 10-11 రాత్రి డేరా వలీ గలీ ప్రాంతంలో మొదలైన ఈ ఎన్‌కౌంటర్‌ దాదాపు వారానికి పైగా కొనసాగింది. ఈ ఎన్‌కౌంటర్లో ఇద్దరు జేసీవో అధికారులతో సహా 9 మంది సైనికులు మరణించారు. ఇక్కడ దాదాపు 9 కిలోమీటర్ల మేరకు దట్టంగా విస్తరించిన అడవిలో ఉగ్రవాదులు నక్కి దాడి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉగ్రవాదుల మృతదేహాలు దళాలకు కనిపించలేదు. ఇక్కడ తొలుత అక్టోబర్‌ 10వ తేదీన జరిగిన దాడిలో ఒక జేసీవోతో  సహా ఐదుగురు సైనికులు మృతి చెందారు. ఇదే ఆపరేషన్‌లో గురువారం మరో ఒక జేసీవో సహా ఇద్దరు సైనికులు అదృశ్యమయ్యారు. వీరి మృతదేహాలను రెండ్రోజుల తర్వాత దళాలు గుర్తించి అతికష్టం మీద స్వాధీనం చేసుకొన్నాయి.

దాదాపు ఎనిమిది రోజుల నుంచి ఉగ్రవాదులు అడవుల్లో నక్కి భద్రతా  దళాలకు భారీగా నష్టాన్ని కలుగజేస్తున్న  తీరుపై సైన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. వీరిలో పాకిస్థాన్‌ సైన్యంలో అత్యున్నత కమాండో దళాలకు చెందిన వారు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ ముగిసేవరకు దీనిని ధ్రువీకరించలేమని చెబుతున్నారు. ఇప్పటికీ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది.

ప్రస్తుతం ఉగ్రవాదులు తప్పించుకోలేకుండా ఉచ్చులో ఇరికించినట్లు దళాలు చెబుతున్నాయి. ఇప్పటికే పారా కమాండోలతోపాటు హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. త్వరలోనే ఈ సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌ ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు.

శీతాకాలం చొరబాట్లు మొదలు కావడంతో..

ఫిబ్రవరిలో భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించే సమయంలో పాక్‌ సైన్యం కాల్పులు జరపడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మూడు నెలల క్రితమే చొరబాటు యత్నాలకు విరామం ఇచ్చారు. కానీ, ఇప్పుడు శీతాకాలం సమీపిస్తుండటంతో ప్రకృతి సహకరిస్తుండటంతో పాక్‌ సైన్యం చొరబాట్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో తిష్ఠవేసిన ఉగ్రమూకలు చొరబాట్లకు యత్నాలు మొదలుపెట్టాయి.

ఉగ్రవాదుల కంటే ఆయుధాలు ఎక్కువ..

పాక్‌ సైన్యం పంపించే ఉగ్రవాదుల  సంఖ్య కంటే వారికి అందజేసే ఆయుధాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. అంటే స్థానిక ఉగ్రవాదుల వద్ద ఆయుధ కొరత ఉందని అర్థం. దీంతో వారు చిన్న ఆయుధాల వినియోగంపై మొగ్గారు. గత సెప్టెంబర్‌లో సైన్యం ముగ్గురు చొరబాటుదారుల్ని మట్టుబెట్టింది. వీరి వద్ద ఐదు ఏకే రైఫిల్స్‌, ఎనిమిది పిస్తోళ్లు, రెండు ఐఈడీలు, 69 గ్రనేడ్‌లు ఉన్నాయి. ఇది కశ్మీర్‌లో ఉన్న స్థానిక ఉగ్రవాదులకు పాక్‌ నుంచి ఆయుధాలు అందుతున్నాయనడానికి బలమైన ఆధారం.

పార్ట్‌టైమ్‌ లేదా హైబ్రీడ్‌ ఉగ్రవాదం..

భద్రతా దళాల నిఘాలో లేని వ్యక్తులు ఇటీవల ఎక్కువగా దాడులు చేసినట్లు తేలింది. వీరంతా కరుడుగట్టిన ఉగ్రవాదుల వలే దళాల నిఘా రాడార్లో ఉండరు. వీరు కేవలం అప్పటికప్పుడు ఒకట్రెండు దాడులు చేసి మళ్లీ సాధారణ జీవితంలోకి వెళ్లిపోతారు. గత రెండు వారాలుగా జరిగిన ఏడుగురు పౌరుల హత్యల్లో పిస్తోల్స్‌తో దాడి చేసిన నిందితుల్లో ఎక్కువ మంది సెక్యూరిటీ ఫోర్స్‌ల నిఘాలో లేరని తేలింది. వీరి శిక్షణ స్థానికంగానే జరుగుతోంది.

ముప్పుగా మారుతున్న చిన్న ఆయుధాలు..

హైబ్రీడ్‌ ఉగ్రవాదులు ఎక్కువగా చిన్న ఆయుధాలనే వాడుతున్నారు. కశ్మీర్‌లో ఈ ఒక్క ఏడాదే ఇప్పటి వరకు 97 పిస్తోళ్లను స్వాధీనం చేసుకోవడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. పాకిస్థాన్‌ కూడా డ్రోన్ల నుంచి జారవిడిచేందుకు పిస్తోళ్లు, గ్రనేడ్‌లు అనుకూలంగా ఉంటున్నాయి. కేవలం ప్రజల్లో పరస్పర నమ్మకాన్ని దెబ్బతీసి భయానక వాతావరణం సృష్టించడమే దీని లక్ష్యం. ఇటీవల గమనిస్తే.. ఐఈడీ పేలుళ్ల వంటి భారీ దాడులను రెండేళ్లుగా ఉగ్రవాదులు పెద్దగా నిర్వహించడంలేదు. ఇది వారి వ్యూహాంలో మార్పునకు సంకేతం.

సాధారణంగా లక్ష్యంగా పెట్టుకొన్న వ్యక్తిని చంపడానికే పిస్తోళ్లు, గ్రనేడ్లను వినియోగిస్తారు. గతేడాది అక్టోబర్‌ 15 వరకు 203 పిస్తోళ్లను ,152 ఏకే రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకొన్నట్లు సైన్యం తేలిపింది. ప్రతి ఎన్‌కౌంటర్‌లో దళాలు ఈ చిన్న ఆయుధాలను స్వాధీనం చేసుకొంటూనే ఉన్నాయి. ఒక్కో పిస్తోల్‌కు 10 రౌండ్ల తూటాల చొప్పున కేటాయిస్తున్నారు. అదే భారీ రైఫిల్‌కు 66 రౌండ్లు సగటున ఉగ్రవాదులు కేటాయిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. సీనియర్‌ ఉగ్రవాదులకు రైఫిల్స్‌ ఇస్తూ.. కొత్తగా ఉగ్రవాదంలోకి వచ్చిన వారికి మాత్రం పిస్తోళ్లు ఇస్తారని గతేడాది సీఆర్‌పీఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు. భూమార్గంలో ఆయుధ రవాణాపై సైన్యం ఉక్కుపాదం మోపడంతో డ్రోన్ల సాయంతో పంజాబ్‌, జమ్ము, కశ్మీర్‌ ప్రాంతాల్లో ఆయుధాలను జారవిడుస్తున్నారు. వీటిల్లో రైఫిళ్ల సంఖ్యతో దాదాపు సమానంగా పిస్తోళ్లు, గ్రనేడ్లు వంటివి ఉంటున్నాయి.

ఉగ్రకార్యకలాపాలకు కొత్త విధానం  ..: కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌

‘‘అమాయకులను పిస్తోళ్లతో హత్యలు చేయడం ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడగా మారింది. ఈ ఏడాది హత్యకు గురైన పోలీసు అధికారులు మొత్తం నిరాయుధులే. వారి వద్ద దాడి సమయంలో ఎటువంటి ఆయుధాలు లేవు. వీరిలో అత్యధిక మందిని పిస్తోళ్లతోనే ఉగ్రవాదులు హత్య చేశారు. చిన్న ఆయుధాలతో దాడి సులభం కావడంతో పాకిస్థాన్‌ ఈ మార్గాన్ని ఎంచుకొంది’’


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని