Kashmir: రగులుతున్న కశ్మీర్‌.. భీకర ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరుల హతం

జమ్ముకశ్మీర్‌ అట్టుడుకుతోంది. కశ్మీరీ పండిట్‌ రాహుల్‌ భట్‌ (35) హత్య నేపథ్యంలో ఓ వైపు నిరసనలు కొనసాగుతుండగా.. మరో వైపు భీకర ఎన్‌కౌంటర్లు సాగుతున్నాయి.......

Published : 13 May 2022 22:08 IST

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ అట్టుడుకుతోంది. కశ్మీరీ పండిట్‌ రాహుల్‌ భట్‌ (35) హత్య నేపథ్యంలో ఓ వైపు నిరసనలు కొనసాగుతుండగా.. మరో వైపు భీకర ఎన్‌కౌంటర్లు సాగుతున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులను సెక్యూరిటీ దళాలు మట్టుబెట్టాయి. బందీపొరా జిల్లా బ్రార్‌ అగారమ్‌ ప్రాంతంలో ముష్కరులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానిక పోలీసులతో కలిసి అణువణువూ గాలించాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. బలగాలు ప్రతిఘటించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. మృతులను ఫైసల్‌ అలియాస్‌ సికందర్‌, అబు ఉసాకాగా పోలీసులు గుర్తించారు. 

న్యాయం చేయాలంటూ పండిట్ల నిరసన

బూద్గామ్‌ జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు రద్దీగా ఉన్న చడూరా తహసీల్‌ కార్యాలయంలో రాహుల్‌ భట్‌ అనే కశ్మీరీ పండిట్‌ను నిన్న ఇద్దరు ఉగ్రవాదులు కాల్చి చంపి అక్కడి నుంచి పరారైన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై కశ్మీరీ పండిట్లు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక మంది న్యాయం కోరుతూ రోడ్లపైకి చేరి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాహుల్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆర్థికంగా ఆదుకుంటామని, వారి కుమార్తె చదువులకు అయ్యే ఖర్చులు భరిస్తామని ప్రకటించింది. రాష్ట్ర లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని