Lancet on Corona: వాటిపై 2 నెలల నిషేధం!

విస్తృత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా కరోనా ఉద్ధృతిపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా ఇళ్లల్లో జరిగే సామూహిక కార్యక్రమాలపై కనీసం రెండు నెలలపాటు పూర్తిగా నిషేధం విధిస్తేనే వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వస్తుందని టాస్క్‌ఫోర్స్‌ నివేదిక స్పష్టం చేసింది.

Updated : 19 Apr 2021 19:56 IST

లాన్సెట్‌ కరోనా టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

దిల్లీ: విస్తృత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా కరోనా ఉద్ధృతిపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ లాన్సెట్‌ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా ఇళ్లల్లో జరిగే సామూహిక కార్యక్రమాలపై కనీసం రెండు నెలలపాటు పూర్తిగా నిషేధం విధిస్తేనే వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వస్తుందని ఆ టాస్క్‌ఫోర్స్‌ నివేదిక స్పష్టం చేసింది.

వైరస్‌ ఉద్ధృతికి కారణాలివే..!

కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. అయినా వైరస్‌ ఉద్ధృతి అదుపులోకి రావడం లేదు. దీనికి మతపరమైన సమావేశాలు, ఎన్నికలు, పెళ్లిళ్లు, క్రీడల్లాంటివి కారణమవుతున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. ‘10 మందికంటే ఎక్కువ జనాభా గుమికూడే కార్యక్రమాలపై రెండు నెలలపాటు పూర్తి స్థాయిలో తాత్కాలిక నిషేధం విధించాలని సిఫార్సు చేస్తున్నాం’ అని లాన్సెట్‌ ఏర్పాటు చేసిన భారత్‌లో‌ని టాస్క్‌ఫోర్స్‌ బృందం స్పష్టం చేసింది.

పశ్చిమ్‌బెంగాల్‌, మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అక్కడి ర్యాలీలపై ఎన్నికల సంఘం ఎలాంటి నిషేధం విధించలేదు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని మాత్రమే సూచించింది. కరోనా తీవ్రత పెరుగుతున్నా.. పలు రాష్ట్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఉత్తరాఖండ్‌లో జరిగిన కుంభమేళాలోనూ కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు. ఇలా ఆయా రాష్ట్రాల్లో జరుగుతోన్న సామూహిక కార్యక్రమాలు వైరస్‌ ఉద్ధృతికి కారణమవుతున్నట్లు లాన్సెట్‌ నిపుణుల బృందం స్పష్టం చేసింది. ఇన్‌ఫెక్షన్‌, అనారోగ్యం, మరణాలు వంటి ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేసే  కార్యక్రమాలను అధిగమించేలా కృషి చేయాలని అభిప్రాయపడింది.

వాటిని మూయాల్సిందే..!

వివిధ ప్రాంతాల్లో జరిగే సామూహిక కార్యక్రమాల నుంచి సొంతూళ్లకు వచ్చేవారిపై పర్యవేక్షణ జరపాల్సిన అవసరాన్ని టాస్క్‌ఫోర్స్‌ బృందం నొక్కిచెప్పింది. అంతేకాకుండా సినిమా థియేటర్లు, క్రీడా మైదానాలు, 50 మందికి పైగా హాజరయ్యే ఇండోర్‌ కార్యక్రమాలపై ఏప్రిల్‌, మేలో పూర్తిస్థాయిలో తాత్కాలిక నిషేధం విధించాలని అభిప్రాయపడింది. ఇక కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను ప్రస్తావించిన నిపుణుల బృందం.. వికేంద్రీకరణ పద్ధతిలో ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ఐసోలేషన్‌ను పర్యవేక్షించాలని సూచించింది. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో పాటు ఆయా రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ఇలాంటి వాటిని ముమ్మరంగా చేపట్టాలని పేర్కొంది. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా చేపట్టవచ్చని తెలిపింది. కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో స్థానికంగా ఉండే కమ్యూనిటీ కేర్‌ సెంటర్లను కొవిడ్‌ రోగులకు ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగించుకోవాలని లాన్సెట్‌ టాస్క్‌ఫోర్స్‌ నివేదిక సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని