Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం.. అమరులైన ఇద్దరు జవాన్లు

 జమ్మూకశ్మీర్‌లోని (Jammu Kashmir) కుల్గాం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. 

Updated : 06 Jul 2024 23:17 IST

కుల్గాం: జమ్మూకశ్మీర్‌లోని (Jammu Kashmir) కుల్గాం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో (Encounter) నలుగురు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు. ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. కుల్గాం జిల్లాలోని మోడెర్‌గాం, ఫ్రిజల్‌ ప్రాంతాల్లో ఉగ్రకదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్‌ చేపట్టాయి. మోడెర్‌గాం గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని తెలుసుకున్న సీఆర్‌పీఎఫ్‌, ఆర్మీ జవాన్లు.. స్థానిక పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించారు. వారిని గమనించిన ముష్కరులు తప్పించుకునేందుకు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన జవాన్‌.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇంట్లో దాక్కొని కాల్పులు జరపడంతో వారిని టార్గెట్‌ చేయడం భద్రతా బలగాలకు సవాల్‌గా మారింది. దీంతో మరింత సైన్యం గ్రామానికి చేరుకొని ఇంటిని ముట్టడించింది. ముష్కరులు ఇంకా ఆ ఇంట్లోనే దాక్కున్నట్లు భద్రతాబలగాలు అనుమానిస్తున్నాయి.

అక్కడికి కొద్దిసేపటి తర్వాత అదే జిల్లాలోని ఫ్రిజల్‌ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక జవాన్‌ ప్రాణాలు కోల్పోయారు. అటువైపు నుంచి భారీగా కాల్పులు జరపడంతో మృతదేహాలను స్వాధీనం చేసుకోవడం సాధ్యపడలేదని అధికారులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌ ముగిసిన తర్వాత భద్రతాబలగాలు డ్రోన్‌ ద్వారా ఆ ప్రాంతాన్ని చిత్రీకరించాయి. ఘటనా స్థలంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు