ఆమె మృతికి బిర్యానీనే కారణమా..? విచారణకు ఆదేశించిన ఆరోగ్య శాఖ

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్‌ చేసి, తిన్నాక కేరళ(Kerala)కు చెందిన యువతి మృతి చెందింది. ఈ మృతికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.

Updated : 07 Jan 2023 13:36 IST

కాసరగోడ్‌: ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన బిర్యానీ(biryani) తిన్న మహిళ.. ఆ తర్వాత అస్వస్థతకు గురై, మృతి చెందిన ఘటన కేరళ(Kerala)లో చోటుచేసుకుంది. ఇందులో ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కేరళ ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాసరగోడ్‌కు చెందిన అంజు శ్రీ పార్వతి(20) డిసెంబర్‌ 31న దగ్గర్లోని హోటల్‌నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకుంది. అది తిన్న తర్వాత ఆమె అస్వస్థతకు గురైంది. మొదట ఆమెకు దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించగా.. తర్వాత కర్ణాటకకు తరలించారు. చికిత్స పొందుతూ ఆ యువతి శనివారం ఉదయం మృతి చెందింది. ‘మృతురాలు తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఫొరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేరళ ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. ‘ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌ను ఆదేశించాం’ అని మంత్రి వీణా జార్జ్ మీడియాకు వెల్లడించారు.

కొద్దిరోజుల క్రితం కొళికోడ్‌లో కూడా ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. కొట్టాయం మెడికల్ కాలేజ్‌కు చెందిన నర్స్‌ దగ్గర్లోని హోటల్‌లో ఆహారం తిన్న తర్వాత మృతి చెందింది. ఆమె మృతికి ఫుడ్‌ పాయిజనే కారణమని అనుమానాలున్నాయి. ఈ వరుస ఘటనలను ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు