UNICEF: 20 కోట్ల మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్య దూరం!

కరోనా ఉద్ధృతి సమయంలో చాలావరకు దేశాలు ఆన్‌లైన్‌ విద్యాబోధన వైపు దృష్టిసారించాయి. కానీ.. నేటికీ కనీసం 20 కోట్ల మంది పాఠశాల స్థాయి విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యాబోధనకు సిద్ధంగా లేని 31 దేశాల్లో నివసిస్తున్నారని యూనిసెఫ్‌ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది...

Published : 28 Oct 2021 22:27 IST

యూనిసెఫ్‌ అధ్యయనంలో వెల్లడి

న్యూయార్క్‌: కరోనా ఉద్ధృతి సమయంలో చాలావరకు దేశాలు ఆన్‌లైన్‌ విద్యాబోధన వైపు దృష్టిసారించాయి. కానీ.. నేటికీ కనీసం 20 కోట్ల మంది పాఠశాల స్థాయి విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యాబోధనకు సిద్ధంగా లేని 31 దేశాల్లో నివసిస్తున్నారని యూనిసెఫ్‌ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఇవన్నీ తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాలేనని, భవిష్యత్తులో ఎప్పుడైనా అత్యవసర సందర్భాల్లో బడులు మూతబడినప్పుడు.. వారికి విద్య అందడం కష్టమేనని పేర్కొంది. ఈ విద్యార్థుల్లోనూ 10.2 కోట్ల మంది కరోనా కారణంగా ఇంకా స్కూళ్లు తెరవని 14 దేశాల్లో నివసిస్తున్నారని పేర్కొంది. కాంగో, ఇథియోపియా, మడగాస్కర్‌, నైగర్‌, మలావీ, టోగో తదితర దేశాల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, ఇక్కడ విద్యారంగం మెరుగుపడాల్సిన అవసరం ఉందని సూచించింది.

మూడు అంశాలపై దృష్టి..

అత్యవసర సందర్భాల్లో విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన అందించేందుకు ఆయా దేశాల సన్నద్ధతపై ‘రిమోట్ లెర్నింగ్ రెడీనెస్ ఇండెక్స్’ పేరిట యూనిసెఫ్‌ ఈ నివేదికను రూపొందించింది. మొత్తం 67 దేశాల్లో వివరాలు సేకరించింది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ విద్యకు వీలుగా డిజిటల్‌ ఉపకరణాల లభ్యత, తల్లిదండ్రుల విద్యాస్థాయిలు.. ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యావిధానాలు.. అత్యవసర పరిస్థితుల కోసం విద్యారంగం సంసిద్ధత.. ఈ మూడు అంశాలపై దృష్టి సారించింది. ఆన్‌లైన్‌ విద్యలో పరిమితులు, దాన్ని అందిపుచ్చుకునే క్రమంలో అసమానతలనూ నివేదిక ప్రస్తావించింది. అందుబాటులో ఉన్న వివరాల కంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని హెచ్చరించింది. అధిక ఆదాయ దేశాల్లోనూ రిమోట్ లెర్నింగ్‌తో విద్యార్థులు సవాళ్లు ఎదుర్కొన్నారని తెలిపింది.

ప్రీ ప్రైమరీ విద్యపై నిర్లక్ష్యం..

విద్యారంగంలో ‘ప్రీ ప్రైమరీ’ ఎక్కువగా నిర్లక్ష్యానికి గురవుతోందని యూనిసెఫ్‌ పేర్కొంది. దీంతో కీలకమైన వయస్సులో పిల్లలు చదువులో వెనుకబడిపోతున్నారని చెప్పింది. వాతావరణ మార్పుల దుష్పలితాలూ ఆన్‌లైన్‌ బోధనపై గణనీయంగా ప్రభావితం చూపుతున్నాయని తెలిపింది. పైన పేర్కొన్న 31 దేశాల్లో 23 దేశాల్లో ఈ తరహా అవాంతరాలు ఎదురవుతున్నట్లు వివరించింది. ‘ప్రస్తుతం మనం ఓ మహమ్మారి పరిస్థితుల నడుమ ఉన్నాం. భవిష్యత్తులోనూ ఇటువంటివి వస్తాయి! కానీ.. ఒకసారి అనుభవమయ్యాక కూడ మనం ఆన్‌లైన్‌ విద్య దిశగా పురోగతి సాధించడం లేదు’ అని యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ వ్యాఖ్యానించారు. పిల్లలకు ఈ తరహా బోధన అందేలా సంస్థ తరఫున విశేష కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని