Demonetisation: పెద్ద నోట్ల రద్దును సమర్థించిన సుప్రీంకోర్టు

పెద్ద నోట్ల రద్దు(demonetisation) అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.

Updated : 02 Jan 2023 12:06 IST

దిల్లీ: పెద్ద నోట్ల రద్దు(demonetisation) అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ చర్యలను సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం సమర్థించింది. ఈ తీర్పును జస్టిస్‌ ఎన్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించింది.  పెద్దనోట్ల రద్దు(demonetisation)ను ధర్మాసనంలోని నలుగురు సభ్యులు సమర్థించారు. 2016 నవంబర్‌ 8 నోటిఫికేషన్‌ చెల్లుబాటు అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. 

ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితం ఆధారంగా నోట్ల రద్దు (demonetisation)నిర్ణయాన్ని కొట్టివేయలేమని న్యాయస్థానం పేర్కొంది. ఈ నిర్ణయం వెనుక మూడు లక్ష్యాలను గుర్తించినట్లు వెల్లడించింది. దీంతోపాటు ఆ లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని తేడాలు ఉన్నాయని చెప్పింది. అలాగని వాటి ఆధారంగా ఈ చర్యలను కొట్టిపారేయలేమని తేల్చిచెప్పింది.

* పెద్దనోట్ల రద్దు(demonetisation)పై కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదని.. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు.

* నోట్ల రద్దు (demonetisation)విషయంలో కేంద్రం వైఖరిని జస్టిస్‌ నాగరత్న తప్పుపట్టారు. నోట్ల రద్దు(demonetisation) విషయంలో ప్రభుత్వం కేవలం గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా కాకుండా ప్లీనరీ చట్టం రూపంలో నిర్ణయం వెలువరించాల్సిందని అభిప్రాయపడ్డారు. ‘‘ఈ చర్యను మంచి ఉద్దేశంతోనే బాగా ఆలోచించి చేపట్టారు. ముఖ్యంగా బ్లాక్‌ మనీ, టెర్రర్‌ ఫండింగ్‌, దొంగనోట్లను లక్ష్యంగా చేసుకొని దీనిని తీసుకొన్నారు. కానీ, ఆ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోకుండా.. పూర్తిగా చట్టవిరుద్ధంగా తీసుకొన్న చర్య ఇది. 2016లో వెలువడిన నోటిఫికేషన్‌ ఇది. దీనిపై ఇప్పుడు ఎటువంటి స్టే ఇవ్వలేం. న్యాయస్థానం జరగబోయే వాటిపైన చర్యలు తీసుకోగలదు. నోట్ల రద్దు ఇప్పటికే జరిగిపోయింది. పిటిషనర్లకు ఎటువంటి ఉపశమనం ఇవ్వలేం’’ అని జస్టిస్‌ నాగరత్న పేర్కొన్నారు.

పెద్ద నోట్ల రద్దు(demonetisation)కు వ్యతిరేకంగా దాఖలైన 58 పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు(Supreme Court) సోమవారం తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు (demonetisation)చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలను గత డిసెంబరు 7న ఆదేశించింది. జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇప్పటికే విచారణను ముగించి తీర్పును నేటికి రిజర్వు చేసింది. నేడు ఈ అంశంపై రెండు వేర్వేరు తీర్పులు వెలువడ్డాయి. ధర్మాసనం సభ్యులు జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్న రెండో తీర్పు వెలువరించారు. వీరిచ్చిన రెండు తీర్పులు భిన్నంగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని