Supreme court: తొక్కిసలాట కేసు.. సుప్రీం కోర్టులో షారుఖ్‌ ఖాన్‌కు ఊరట

గుజరాత్‌లోని వడోదర(Vadodara) రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమయ్యారన్న కేసు(Stampede Case)లో బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌(Shah Rukh Khan) ఖాన్‌కు సుప్రీం కోర్టు(Supreme Court)లో ఊరట లభించింది....

Published : 27 Sep 2022 01:49 IST

దిల్లీ: గుజరాత్‌లోని వడోదర (Vadodara) రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమయ్యారన్న కేసు (Stampede Case)లో బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan)కు సుప్రీం కోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. ఈ వ్యవహారంపై ఆయనపై నమోదైన క్రిమినల్‌ కేసును కొట్టేయాలంటూ గుజరాత్‌ హైకోర్టు (Gujarat High Court) గతంలో జారీ చేసిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.

‘రాయిస్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా 2017లో షారుఖ్‌ ఖాన్‌ తన నిర్మాణ బృందంతో కలిసి ముంబయి నుంచి దిల్లీకి రైలులో వెళ్లారు. మార్గమధ్యంలో వడోదర స్టేషన్‌లో ఆయన్ను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. అయితే, గుమిగూడిన జనంపై ఆయన టీ షర్టులు, స్మైలీ బాల్స్‌ విసరడం.. తొక్కిసలాటకు దారి తీసిందని ఆరోపిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జితేంద్ర మధుభాయ్‌ సోలంకి అనే వ్యక్తి వడోదర కోర్టులో ఫిర్యాదు చేశారు. దాన్ని కొట్టేయాలని కోరుతూ షారుఖ్.. గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఫిర్యాదుదారుడు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. తాజాగా షారుఖ్‌కు మరోసారి ఊరట లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని