Covid Effect: పర్యాటక రంగంలోనే 2.15కోట్ల ఉద్యోగాలు మాయం..!

కొవిడ్‌ విజృంభించిన మూడు వేవ్‌లలో పర్యాటక రంగంలో మొత్తం 2.15కోట్ల ఉద్యోగాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Published : 15 Mar 2022 01:51 IST

వెల్లడించిన కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 మహమ్మారి చూపిన ప్రభావంతో దాదాపు అన్ని రంగాలూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా భారత్‌లో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. కొవిడ్‌ విజృంభించిన మూడు వేవ్‌లలో పర్యాటక రంగంలో మొత్తం 2.15కోట్ల ఉద్యోగాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్‌ విజృంభణ ప్రభావం పర్యాటక రంగంపై ఏవిధంగా పడిందనే విషయంపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపింది.

‘కొవిడ్‌ తొలివేవ్‌ విజృంభించిన సమయంలో దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్య 93శాతం తగ్గింది. సెకండ్‌ వేవ్‌ (ఏప్రిల్‌-మే 2021లో) సమయంలోనూ పర్యాటకుల సంఖ్య 79శాతానికి పడిపోయింది. డిసెంబర్‌ 2021లో థర్డ్‌వేవ్‌ సమయంలో విదేశీ పర్యాటకులు 64శాతం తగ్గిపోయారు. ఇలా మహమ్మారి సమయంలో పర్యాటక రంగంపై కొవిడ్‌ ప్రభావాలను అంచనా వేసేందుకు ఓ అధ్యయనం చేపట్టాం. ఇందులో ఫస్ట్‌వేవ్‌లో 1.45కోట్ల ఉద్యోగాలు, సెకండ్‌ వేవ్‌లో 52లక్షల ఉద్యోగాలు, థర్డ్‌వేవ్‌లో 18లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తేలింది’ అని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

కొవిడ్‌కు ముందు దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో మొత్తం 3.8కోట్ల మంది ప్రజలు ఉపాధి పొందినట్లు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. అయితే, పర్యాటక రంగంలో ఈ ప్రతికూల ప్రభావం కేవలం ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకుగానూ ఇప్పటికే తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఇందులో భాగంగా ట్రావెల్‌, టూరిజంపై ఆధారపడిన సంస్థలకు రూ.పదిలక్షలు, టూరిస్ట్‌ గైడ్‌లకు రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రపంచ పర్యాటక వేదికపై భారత్‌ను నిలబెట్టేందుకుగానూ నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తోన్న కృషి కారణంగా అంతర్జాతీయ స్థాయిలో గడిచిన ఏడు సంవత్సరాల్లోనే భారత్‌ 20స్థానాలు మెరుగు పరచుకుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు