Punjab Elections: పంజాబ్‌ ఎన్నికల బరిలో రైతు సంఘాలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా పోరాడిన రైతు సంఘాలు ఇప్పుడు ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమయ్యాయి. పంజాబ్‌లోని 22 రైతు సంఘాలు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి.

Published : 26 Dec 2021 01:32 IST

చండీగఢ్‌: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా పోరాడిన రైతు సంఘాలు ఇప్పుడు ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమయ్యాయి. పంజాబ్‌లోని 22 రైతు సంఘాలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో ‘రాజకీయ మార్పు’ సాధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా సంఘాల ప్రతినిధుల తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ప్రకటించిన నేపథ్యంలో ఈ 22 సంఘాలు తమ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. రైతు ఉద్యమంలో పంజాబ్‌ నుంచి 32 సంఘాలు పాల్గొనగా.. అందులో 22 సంఘాలు ఎన్నికల సమరంలో పాల్గొననున్నాయి.

ఎన్నికల కోసం కొత్తగా సంయుక్త సమాజ్‌ మోర్చా (ఎస్‌ఎస్‌ఎం) అనే రాజకీయ వేదికను ఏర్పాటు చేసినట్లు రైతు నేత హర్మీత్‌ సింగ్‌ కడియన్‌ శనివారం మీడియాకు తెలిపారు. సాగు చట్టాల రద్దు కోసం ఏడాది పాటు రైతు ఉద్యమం నిర్వహించిన తర్వాత పంజాబ్‌ ప్రజలకు తమపై అంచనాలు పెరిగాయని, రాష్ట్రం బాగు కోసమే ఈ మోర్చాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాల్లోనూ పోటీ చేస్తామని వెల్లడించారు. సరికొత్త పంజాబ్‌ నిర్మాణానికి మరిన్ని రైతు సంఘాలు కూడా భాగస్వాములు కావాలని పిలపునిచ్చారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (రాజేవాల్‌) నేత బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ ఈ కొత్త మోర్చాకు నేతృత్వం వహిస్తారని తెలిపారు. పంజాబ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అని విలేకరులు ప్రశ్నించగా.. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని రాజేవాల్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా 475 రైతు సంఘాలు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం)గా.. సాగు చట్టాలపై పోరాడిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు దూరంగా ఉండాలని ఎస్‌కేఎం నిర్ణయించిన నేపథ్యంలో ఆ పేరును ఎవరూ ఉపయోగించడానికి వీల్లేదని సంఘం నేతలు ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో కొత్త మోర్చా ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని