Corona: ముంబయిలో ఒక్కరోజే 2,293 కేసులు.. దిల్లీలో 7.01శాతానికి పాజిటివిటీ రేటు

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా రాజధాని దిల్లీ సహా ముంబయిలో వైరస్ విజృంభిస్తున్నట్లు కనిపిస్తోంది........

Published : 15 Jun 2022 21:53 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ (Coronavirus) ఉద్ధృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా రాజధాని దిల్లీ (Delhi) సహా ముంబయిలో (Mumbai) వైరస్ విజృంభిస్తున్నట్లు కనిపిస్తోంది. ముంబయిలో బుధవారం 2,293 కొత్త కేసులు బయటపడటం భయాందోళన కలిగిస్తోంది. నిన్నటి కేసులతో (1724) పోలిస్తే దాదాపు 570 కేసులు అధికంగా నమోదవడం గమనార్హం. గత ఐదు నెలల కాలంలో ఇవే అత్యధిక కేసులు. వైరస్‌ కారణంగా ఒకరు మరణించినట్లు ముంబయి పురపాలక సంస్థ (BMC) వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు ముంబయిలో 10,85,882 వైరస్‌ బారినపడగా, 19,576 మంది మృత్యువాతపడినట్లు బీఎంసీ తెలిపింది.

దిల్లీలోనూ భారీగానే కేసులు వెలుగుచూస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే 1,375 మంది వైరస్‌ బారిన పడ్డారు. తాజా కేసులతో దిల్లీలో పాజిటివిటీ రేటు 7.01కు చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించిన వివరాల ద్వారా వెల్లడవుతోంది. అయితే మరణాలు మాత్రం నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. హస్తినలో వెయ్యికి పైగా కేసులు నమోదుకావడం వరుసగా ఇది రెండో రోజు. మంగళవారం 1,118 కేసులు బయటపడ్డాయి. పాజిటివీ రేటు నిన్న 6.50శాతం ఉండగా.. తాజాగా అది 7.01 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం 3,643 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కేసులతో దిల్లీలో కరోనా బారినపడినవారి సంఖ్య 19,15,905కు చేరగా.. మృతుల సంఖ్య 26,223కు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని