Tragedy: ‘మహా’ విషాదం.. ఆస్పత్రిలో ఒకేరోజు 12మంది శిశువులు సహా 24 మంది మృతి

Maharashtra Tragedy: నాందేడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ‘మహా’ విషాదం చోటుచేసుకుంది. ఔషధాల కొరత కారణంగా 24గంటల వ్యవధిలోనే 12మంది నవజాత శిశువులతో పాటు మొత్తం 24మంది మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది.

Updated : 03 Oct 2023 17:45 IST

నాందేడ్‌: మహారాష్ట్ర(Maharashtra)లోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో విషాదం చోటుచేసుకుంది. ఠాణే ప్రభుత్వ ఆస్పత్రి దుర్ఘటన మరువక ముందే తాజాగా నాందేడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో దారుణం వెలుగుచూసింది. ఒకేరోజు 24 మంది మృత్యువాతపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మృతుల్లో 12మంది నవజాత శిశువులు ఉండటం పెను విషాదం రేపుతోంది. ఆస్పత్రిలో ఔషధాలు, సిబ్బంది కొరత వల్లే ఈ దారుణం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆగస్టులో ఠాణేలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో ఒకేరోజు 18మంది రోగులు మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.

తాజాగా గడిచిన 24గంటల వ్యవధిలో ఆస్పత్రిలో 24 మంది మృతిచెందగా.. వీరిలో 12మంది నవజాతా శిశువులు ఉన్నారు. మృతుల్లో ఆరుగురు మగ శిశువులు ఉండగా.. ఆరుగురు ఆడ శిశువులు ఉన్నట్టు ఆస్పత్రి డీన్‌ వెల్లడించారు. మిగతా 12 మంది పలు వ్యాధులు, పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. ఆస్పత్రిలో పలువురు సిబ్బందిని బదిలీ చేయడంతో రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నట్టు చెప్పారు. మరోవైపు, ఈ అంశంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. మూడు ఇంజిన్ల (భాజపా, ఏక్‌నాథ్‌ శిందే- శివసేన,  ఎన్సీపీ- అజిత్‌ వర్గం) ప్రభుత్వమే ఈ మరణాలకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ఈ మరణాలపై ఆస్పత్రి వైద్యుడు డా.శ్యామ్‌రావు వకోడే స్పందించారు. ‘‘ఒక్క వ్యవధిలో 12 మంది చిన్నారులు మృతి చెందారు. మరో 12 మంది వేర్వేరు కారణాలతో మరణించారు. ఆస్పత్రిలో సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు వచ్చాయి. రోగుల కోసం కేటాయించిన బడ్జెట్‌ సర్దుబాటు కాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. 

మళ్లీ అదే అజాగ్రత్త..! కఠిన చర్యలు తీసుకోండి: సుప్రియా సూలే

ఆస్పత్రిలో ఒకేరోజు 12మంది నవజాతా శిశువులతో పాటు 24మంది మృతిచెందిన ఘటనను ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తీవ్రంగా ఖండించారు. ఈ మరణాలు ఖచ్చితంగా యాదృచ్చికం కాదన్న ఆమె..  వీటిపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. గతంలో ఠానేలో ప్రదర్శించిన అజాగ్రత్తే ఈసారి కూడా కనిపిస్తోందని విమర్శించారు. ఒకరి తప్పుల్ని మరొకరు కప్పిపుచ్చుకొనేందుకు దాగుడు మూతలు ఆడుతున్నారంటూ ప్రభుత్వం తీరును ఆక్షేపించారు. మహారాష్ట్ర ప్రజల ప్రాణాలంటే అంత చులకనా? అని మండిపడ్డారు. ఆస్పత్రుల్లో మందుల కొరత కారణంగా సకాలంలో మందులు అందడంలేదని రోగులు వాపోతున్నారని చెప్పారు. ఈ ఘటనలో కఠిన చర్య తీసుకోవాలని సుప్రియా సూలే డిమాండ్‌ చేశారు. సంబంధిత మంత్రులతో రాజీనామా చేయించాలని, అలాగే, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని సీఎం ఏక్‌నాథ్‌ శిందేను కోరారు.

తీవ్ర దిగ్భ్రాంతికరం.. ఆదిత్య ఠాక్రే

ఈ ఘటనపై శివసేన (యూబీటీ) నేత, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 12మంది నవజాతా శిశువులు మృతిచెందడం చాలా తీవ్రమైన అంశమన్నారు. ఈ బాధాకరమైన సమయంలో బాధిత కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. సకాలంలో మందులు సరఫరా చేయకపోవడం వల్లే రోగులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అర్థమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడిందన్న ఆయన.. ముంబయిలోని పలు ప్రభుత్వ, మునిసిపల్ ఆసుపత్రుల్లో మందుల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. దీని పర్యవసానాలను రాష్ట్ర వ్యాప్తంగా అమాయక ప్రజలు చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితికి వ్యతిరేకంగా తాము గళం విప్పామని.. ప్రభుత్వానికి లేఖలు సైతం రాసినట్టు చెప్పారు. కేఈఎం ఆస్పత్రి వ్యవహారంలో పాదయాత్ర చేసినా శిందే సర్కార్‌ మౌనం వహిస్తోందని విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని