25 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్‌

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. సామాన్యుడిని మొదలుకొని ప్రముఖుల దాకా అందరికీ ఈ మహమ్మారి వ్యాపిస్తోంది. తాజాగా మరో 25మంది ఎంపీలు కరోనా బారినపడ్డారు..........

Updated : 14 Sep 2020 17:06 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. సామాన్యుడిని మొదలుకొని ప్రముఖుల దాకా అందరికీ ఈ మహమ్మారి వ్యాపిస్తోంది. తాజాగా మరో 25మంది ఎంపీలు కరోనా బారినపడ్డారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఈ నెల 12న పార్లమెంట్‌ ఆవరణలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు కొవిడ్‌ టెస్ట్‌లు చేయించగా.. నివేదికలు వచ్చాయి. వీరిలో 17 మంది లోక్‌సభ సభ్యులు, ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులకు వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా బారిన పడిన లోక్‌సభ సభ్యుల్లో వారిలో అధికార భాజపాకు చెందిన వారు 12 మంది సభ్యులు కాగా.. వైకాపాకు చెందిన ఇద్దరు, శివసేన, డీఎంకే, ఆర్‌ఎల్‌పీ పార్టీలకు చెందిన ఒక్కో ఎంపీ చొప్పున ఉన్నారు.   

వైకాపాకు చెందిన ఇద్దరు ఎంపీల్లో అరకు ఎంపీ మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఉండగా.. భాజపాకు చెందినవారిలో అనంత్‌కుమార్‌ హెగ్డే, మీనాక్షీ లేఖి తదితరులు ఉన్నారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో సభ్యులందరూ కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని లోక్‌సభ, రాజ్యసభ సచివాలయం నిబంధన విధించిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్‌ రిసెప్షన్‌ వద్ద ఉభయ సభల సభ్యులు, అధికారులు, మీడియా సిబ్బందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 56 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఏడుగురు కేంద్రమంత్రులు, 25 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. వీరిలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా ఉన్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే ఆయన మరోసారి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ వైరస్‌ బారిన పడి  ఒక ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని