Tomato Flu: ఒడిశాలో ‘టొమాటొ ఫ్లూ’ కలకలం.. 26 మంది పిల్లలకు వైరస్‌!

ఒడిశాలో టొమాటొ ఫ్లూ కలకలం రేపింది. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్​(HFMD)గా పిలిచే ఈ వ్యాధి 26 మంది చిన్నారులకు సోకింది......

Published : 25 May 2022 01:53 IST

భువనేశ్వర్‌: ఒడిశాలో టొమాటొ ఫ్లూ కలకలం రేపింది. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్​(HFMD)గా పిలిచే ఈ వ్యాధి 26 మంది చిన్నారులకు సోకింది. అయితే ప్రస్తుతం వారికి ఎలాంటి అపాయం లేదని వైద్యులు పేర్కొన్నారు. టొమాటొ ఫ్లూగా పేరుపొందిన వైరస్‌ పేగు సంబంధిత వ్యాధి కారణంగా సోకే అంటువ్యాధి. ముఖ్యంగా చిన్నారులకు ఇది వ్యాపిస్తుంది. వయోజనులకు దీన్ని తట్టుకునే రోగనిరోధక శక్తి ఉండటం వల్ల వారిపై ఈ వ్యాధి ప్రభావం చూపదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధి సోకిన చిన్నారులకు జ్వరం, నోట్లో పుండ్లు, చేతులు, కాళ్లు, పిరుదులపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి.

మొత్తం 36 మంది చిన్నారుల నమూనాలను పరీక్షించగా 26 మందికి ఈ వ్యాధి సోకినట్లు తేలిందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. భువనేశ్వర్​లోని రీజినల్ మెడికల్​ రీసెర్చ్ సెంటర్​లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వ్యాధి బారినపడిన వారిలో 1-9 ఏళ్ల మధ్య వయసు పిల్లలే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వారందరినీ 5-7 రోజుల పాటు ఐసోలేషన్​లో ఉండాలని సూచించారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ అంటువ్యాధి ప్రాణాంతకం కాదని వివరించారు. ఈ నెల ప్రారంభంలో కేరళలోని కొల్లం జిల్లాలోనూ 80 మంది చిన్నారులు టొమాటొ ఫ్లూ బారినపడిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని