covid: యువతపై వైరస్‌ ‘మే’ఘం..!

మే నెలలో నమోదైన కేసులను చూస్తే కొవిడ్‌ యువతలోనే ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.

Published : 27 May 2021 00:20 IST

 ఈనెలలో నాలుగోవంతు బాధితులు యువతే

ఇంటర్నెట్‌డెస్క్‌: మే నెలలో నమోదైన కేసులను చూస్తే కొవిడ్‌ యువతలోనే ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన డేటా కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. మే నెలలో నమోదైన కేసుల్లో 26 శాతం మంది 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సువారే కావడం ప్రమాదఘంటికలు మోగిస్తోంది.   మే మొదటి వారంలోని కేసుల్లో 26.58శాతం, రెండో వారంలో 25.89, మూడో వారంలో 25.64 శాతం ఈ వయస్సు గ్రూపు వారు ఉన్నారు. మే 22 నుంచి 25వ తేదీ వరకు వచ్చిన కేసుల్లో కూడా 25.60శాతం వీరే. 

ఈ వయస్సు గ్రూపు తర్వాత ఉండే 31-40 ఏళ్ల మధ్య వారు మొత్తంగా  22శాతానికి పైగా ఉంది. మొదటి వారంలో 23.12శాతం, రెండో వారంలో 22.79శాతం,మూడోవారంలో 22.58శాతం మంది వైరస్‌ బారినపడినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే బాధితుల్లో దాదాపు 45శాతానికి 18-40 ఏళ్ల వారే ఉంటున్నారు. ఇక పిల్లల్లో వ్యాధిబారిన పడుతున్న వారి శాతం తొలి వారంలో 7.82 ఉండగా.. ఆ తర్వాతి వారాల్లో 8 శాతానికి పైగానే నమోదైంది.  ఈ సందర్భంగా ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా మాట్లాడుతూ థర్డ్‌ వేవ్‌లో పిల్లలే ఈ వైరస్‌ బారిన పడతారనటానికి ఆధారాల్లేవని అన్నారు. ఇప్పటికే సింగపూర్‌ వంటి దేశాల్లో థర్డ్‌వేవ్‌ మొదలైందని.. యువత ఎక్కుగా వైరస్‌ బారిన పడుతోందని పేర్కొన్నారు. 

కరోనా ఫస్ట్‌వేవ్‌లో అత్యధిక రిస్క్‌గ్రూప్‌లో ఉన్న 60 ఏళ్లు పైబడిన వారు ఈసారి కొద్దిగా రిస్క్‌ను తగ్గించుకొన్నారు. ముఖ్యంగా వారికి వ్యాక్సినేషన్‌ కావడం వంటివి ప్రభావం చూపాయి. మే నెలలో 24వ తేదీ వరకు నమోదైన కేసుల్లో ఈ వయస్సువారు 13శాతం మంది ఉన్నారు. ప్రస్తుతం భారత్‌లో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్,స్పుత్నిక్‌-వి టీకాలు అందుబాటులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని