Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్‌ నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా దర్యాప్తు!

రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్హయ్య లాల్‌ దారుణ హత్యకు సంబంధించిన కేసులో మరో సంచలన కోణాన్ని పోలీసులు కనుగొన్నారు.

Published : 02 Jul 2022 02:18 IST

ఉదయ్‌పుర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్హయ్య లాల్‌ దారుణ హత్య కేసులో పోలీసులు మరో సంచలన కోణాన్ని కనుగొన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థతో హంతకులకు సంబంధాలున్నాయనే విషయం ఇప్పటికే వెలుగులోకి రాగా.. హత్య చేసిన తర్వాత నిందితులు పారిపోవడానికి ఉపయోగించిన బైక్‌ గురించి పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి కారణం.. బైక్‌ నంబర్‌ 2611 కావడం. ఇది ముంబయిలో అత్యంత ఘోరమైన ఉగ్రదాడిని ఎదుర్కొన్న తేదీ (26/11)కి సమానంగా ఉండడంతో ఆ మరణహోమానికి వీరికీ ఏమన్న సంబంధం ఉందా? ఆ సమయంలో వీరు ఎక్కడున్నారు? అన్న కోణంలో విచారిస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.

కన్హయ్యను హత్య చేసిన తర్వాత నిందితులు ఇద్దరు గౌస్‌ మహ్మద్‌, రియాజ్‌ అఖ్తారీ RJ 27 AS 2611 నంబర్‌ గల బైక్‌పై పారిపోయారు. వీరిద్దరితో పాటు బైక్‌ను కూడా ధన్‌మండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బైక్‌ను రియాజ్‌ అఖ్తారీ 2013లో కొన్నాడని తెలిసింది. అయితే, బైక్‌ నంబర్‌ కోసం అప్పట్లోనే తను 5వేలు ఖర్చు చేశాడని పోలీసుల విచారణలో తేలింది. రియాజ్ మనసులోని క్రిమినల్ ఆలోచనకు ఈ నంబర్ ప్లేట్ అద్దం పడుతోందని పోలీసులు చెబుతున్నారు. మిగతా విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడీ నంబర్ ప్లేట్ కీలకం కానుందని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు, 2014లో అతడు నేపాల్ వెళ్లాడని అతడి పాస్‌పోర్టు ద్వారా తెలుసుకున్నారు. పాకిస్థాన్‌కు పలుమార్లు కాల్స్ చేసినట్లు అతడి మొబైల్ డేటా ఆధారంగా కనుగొన్నారు. మరోవైపు, హత్యకు గురైన కన్హయ్య లాల్‌ శరీరంపై 26 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఇది ‘ఐఎస్‌ఐఎస్‌ తరహా హత్యే’ అని ఓ మాజీ ఐపీఎస్‌ అధికారి ఒకరు తెలిపారు.

ఇదిలా ఉంటే.. హత్యకు ముందు కన్హయ్య ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదని.. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ ఎస్‌హెచ్‌వోతోపాటు సహాయ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. తాజాగా ఉదయపుర్ ఇన్‌స్పెక్టర్ జనరల్, పోలీస్ సూపరింటెండెంట్‌తో సహా 32 మంది పోలీసు అధికారులను బదిలీ చేశారు. మరోవైపు కన్హయ్య హత్య కేసు నిందితులను పోలీసులు ఉదయ్‌పుర్‌లోని ఓ కోర్టులో గురువారం హాజరుపర్చగా.. కోర్టు వారిద్దరికి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని