Updated : 14 May 2022 13:01 IST

Fire Accident: నా కూతురెక్కడ..? ఏ ఆసుపత్రిలోనూ కనిపించట్లేదు..!

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం: కేజ్రీవాల్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ముంద్కా మెట్రోస్టేషన్ పరిధిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో దాదాపు 27 మంది సజీవ దహనం కాగా.. 12 మంది గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంకా 29 మంది జాడ తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో కొన్ని దయనీయ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. 

 నా కూతురెక్కడ..?

వాణిజ్య సముదాయంలోని మొదటి అంతస్తులో ఉన్న సీసీ టీవీ కెమెరా, రూటర్‌ తయారీ సంస్థలో నిన్న సాయంత్రం మంటలు మొదలయ్యాయి. అవి వేగంగా భవనమంతా వ్యాపించాయి. దాంతో ప్రాణభయంతో భవనంలో చిక్కుకున్నవారు సాయంకోసం హాహాకారాలు చేశారు. మరికొందరు మంటలు తప్పించుకునేందుకు కిటికీల నుంచి కిందికి దూకారు. కొందరు తాళ్లను ఉపయోగించినట్లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోన్న వీడియోలను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలో దగ్గర్లో ఉన్న స్థానికులు వారికి సహకరించారు. ఇరుకు మార్గంలో కిందికి రావాలని ప్రయత్నించి, గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు జాడ తెలియని వారి గురించి వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పూజా అనే యువతి సీసీటీవీ ప్యాకేజింగ్ సంస్థలో పనిచేస్తోంది. ఆమె ప్రాణాలతో ఉందో లేదో తెలియన ఆమె తల్లి తల్లడిల్లిపోతోంది. ‘మూడు నెలల నుంచి నా కుమార్తె పూజా ఇక్కడ సీసీటీవీ ప్యాకేజింగ్ సంస్థలో పనిచేస్తోంది. ఈ ప్రమాదం గురించి మాకు రాత్రి తొమ్మిదింటికి తెలిసింది. నా కూతురు ఎడమకంటి కింద ఒక మార్కు ఉంటుంది. ఆమె కోసం అన్ని ఆసుపత్రులు తిరిగాం. నలుగురం ఉన్న మా కుటుంబానికి తనే ఆధారం. ఆమె ఇద్దరు చెల్లెళ్లు చదువుకుంటున్నారు’ అంటూ ఆ మహిళ రోదిస్తోంది.

రెండో అంతస్తులో మానవ అవశేషాలు..

ఈ అగ్నిప్రమాదానికి ముందు రెండో అంతస్తులు మోటివేషనల్ స్పీచ్ ఈవెంట్‌ జరుగుతోందని అధికారులు వెల్లడించారు. దానికి పెద్ద సంఖ్యలోనే ప్రజలు వచ్చారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఎక్కువ మరణాలు ఈ అంతస్తులోనే చోటుచేసుకున్నాయి. శనివారం ఇక్కడ మానవ అవశేషాలను గుర్తించినట్లు దిల్లీ అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. అవి ఎన్ని మృతదేహాలవో చెప్పడం కష్టమన్నారు. ఇప్పటికైతే మంటలు ఆగిపోయాయని, కూలింగ్, సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు.  

సజీవదహనమైన యజమానుల తండ్రి..

భవన సముదాయంలోని సంస్థ యజమానులు హరీశ్ గోయల్, వరుణ్ గోయల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి తండ్రి కూడా ఈ అగ్నిప్రమాదంలో మరణించారు. భవన యజమాని పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. 

నిబంధనలు పాటించలేదు..

ఈ ముంద్కా వాణిజ్య భవనం విషయంలో నిబంధనలు గాలికివదిలేసినట్లు అధికారులు వెల్లడించారు. భవనానికి అనుమతులు లేవని, బయటకు వెళ్లడానికి ఒక్కటే మార్గం ఉందని చెప్పారు. ఇక్కడ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా కనిపించిందని చెప్పారు. అంతేగాకుండా.. ఒకే గదిలో 50 నుంచి 60 మందిఉన్నారని, బయటనుంచి తాళం వేసి ఉందన్నారు. 

ఘటనా స్థలం వద్దకు కేజ్రీవాల్‌..

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా శనివారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో మృతదేహాలు గుర్తించలేని విధంగా కాలిపోయాయని తెలిపారు. మృతులు, తప్పిపోయిన వారిని గుర్తించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని