VK Paul: రెండో దశ ఇంకా ముగియలేదు

కరోనా రెండో దశ ఇంకా ముగిసిపోలేదని.. దేశం మొత్తం సురక్షితం అయ్యేవరకు ఏ ఒక్కరు కూడా సురక్షితం కాదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ హెచ్చరించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సమావేశంలో....

Published : 02 Jul 2021 23:15 IST

రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

దిల్లీ: కరోనా రెండో దశ ఇంకా ముగిసిపోలేదని.. దేశం మొత్తం సురక్షితం అయ్యేవరకు ఏ ఒక్కరు కూడా సురక్షితం కాదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ హెచ్చరించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వీకే పాల్‌ పాల్గొని మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లోనూ కొవిడ్‌ నివారణ చర్యల్ని పాటించాలని కోరారు. లాక్‌డౌన్‌ నిబంధనలను పలు రాష్ట్రాలు సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆయన హెచ్చరించారు. నిబంధనలు విస్మరిస్తే అనర్థాలు తప్పవన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు కొవిడ్‌ మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే...

* పాజిటివిటీ రేటు అధికంగా (10 శాతం కంటే ఎక్కువ) ఉన్న జిల్లాలను గుర్తించడం.

* బెడ్ ఆక్యుపెన్సీ (ఆక్సిజన్, ఐసీయూ పడకలు), అందుబాటులో ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలను విశ్లేషించండి.

* అధిక కేసులు నమోదయ్యే జిల్లాలు, పాజిటివిటీ లేదా హై బెడ్ ఆక్యుపెన్సీ ఉన్న జిల్లాల్లో ఇంటెన్సివ్ పర్యవేక్షణ.

* ఒకసారి విధించిన ఆంక్షలను కనీసం 14 రోజుల వరకు అమల్లో ఉంచడం.

* కేసులు అధికంగా నమోదయ్యే జిల్లాలకు ఓ సీనియర్ అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించాలి.

* వ్యాధి నియంత్రణ, ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన చర్యలు చేపట్టాలి.

* జిల్లా స్థాయిలో కేసుల సమూహాల ఆధారంగా సూక్ష్మ విశ్లేషణ చేపట్టడం.

* చివరగా.. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేట్ వ్యూహాన్ని అమలు చేయాల్సిందిగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళనకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. ఆయా రాష్ట్రాలకు బృందాలను పంపింది. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని సూచించింది. కేరళ, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కొవిడ్‌ కొత్త కేసుల్లో పెరుగుదల కన్పిస్తోంది. దీంతో ఈ రాష్ట్రాలకు కేంద్రం ఇద్దరు సభ్యుల చొప్పున ఉన్నతస్థాయి బృందాలను పంపించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ బృందాలు తక్షణమే రాష్ట్రాలకు వెళ్లి అక్కడి కొవిడ్‌ పరిస్థితులు, వైరస్‌ నిర్వహణ చర్యలను పరిశీలిస్తాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని