తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు

అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే కేసుపై ఓ వ్యక్తి 26 ఏళ్లుగా చేస్తున్న పోరాటంలో చివరకు విజయం సాధించాడు........

Updated : 16 Jul 2022 11:05 IST

ముజాఫర్‌నగర్‌: అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే కేసుపై ఓ వ్యక్తి 26 ఏళ్లుగా చేస్తున్న పోరాటంలో చివరకు విజయం సాధించాడు. ఆయుధాలు కలిగి ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని 1996 నాటి కేసును ముజఫర్‌నగర్‌ జిల్లా కోర్టు తాజాగా కొట్టివేసింది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న 70 ఏళ్ల రామ్‌ రతన్‌తోపాటు అతడి కుటుంబాన్ని ఈ కేసు ఛిన్నాభిన్నం చేసింది. అతడిని కోలుకోలేని దెబ్బతీసింది. ‘సంతోషించేందుకు ఏమీలేదు. ఈ కేసు నా జీవితాన్ని సర్వనాశనం చేసింది. నా డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. నా పిల్లలు చదువులు కొనసాగించలేకపోయారు. కోర్టు విచారణకు హాజరయ్యేందుకే నా సగం జీవితం గడిచిపోయింది’ అని ఆ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాకు చెందిన రామ్‌ రతన్‌ ఓ దినసరి కూలీ. అయితే 1996 నవంబర్‌లో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇంట్లో నాటు తుపాకీ ఉందని ఆయుధాల చట్టం కింద కేసులు మోపారు. తాను నిర్దోషినని, స్థానిక రాజకీయ నేతలు తమ లబ్ధి కోసం ఈ కేసులో నన్ను కావాలనే ఇరికించారని అరెస్టు చేసినప్పటి నుంచి పోలీసుల వద్ద మొరపెట్టుకుంటూనే ఉన్నా అని రతన్‌ ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నాడు.

‘నాకు అప్పుడు 44 ఏళ్లు. పొలం వద్ద పనిచేసుకుంటున్న నన్ను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆయుధాల చట్టం కింద నాపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రెండు నెలలకు పైగా జైలు జీవితం గడిపా. నా వద్ద ఆయుధం ఉందని పోలీసులు పేర్కొన్నారు. కానీ కోర్టులో మాత్రం ప్రవేశపెట్టలేదు. ఈ కేసు నుంచి బయటపడేందుకు దాదాపు మూడు దశాబ్దాలుగా పోరాడాను. చివరకు న్యాయమే గెలిచింది కానీ ఇందుకు నేను భారీ మూల్యమే చెల్లించుకున్నా’ అంటూ ఆ వృద్ధుడు ఆవేదన చెందాడు. తనకు జరిగిన నష్టానికి పరిహారం అందించాలని, తన జీవితాన్ని నాశనం చేసిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని రతన్‌ కోరుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని