
Jammu Kashmir: డీలిమిటేషన్ వివాదం.. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల గృహనిర్బంధం
శ్రీనగర్: జమ్మూ- కశ్మీర్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)పై నియమించిన కమిషన్.. ఇటీవల మొత్తం ఏడు కొత్త స్థానాల ఏర్పాటును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే, నిబంధనలకు విరుద్ధంగా, భాజపాకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ సిఫార్సులు ఉన్నాయంటూ.. ఎన్సీ, పీడీపీ తదితర స్థానిక పార్టీలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని గుప్కర్ కూటమి శనివారం నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. లోయలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు.. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను గృహనిర్బంధంలో ఉంచారు. వారు నివాసం ఉంటున్న శ్రీనగర్‌లోని గుప్కర్ రోడ్‌ను మూసేశారు. నేతల ఇళ్ల వెలుపల భద్రతా ట్రక్కులను మోహరించారు.
ఈ విషయమై ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేస్తూ.. ‘కొత్త సంవత్సరంలో ఎప్పటిలాగే పోలీసులు ప్రజలను చట్టవిరుద్ధంగా నిర్బంధిస్తోందన్నారు. సాధారణ కార్యకలాపాలకు పరిపాలనా యంత్రాంగం భయపడుతోంది. మా ఇళ్లముందు భద్రతా వాహనాలు నిలిపారు. గేట్లకు తాళాలు వేశారు. అయినా మన నేతలు.. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెబుతుంటారు’ అని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా.. కశ్మీర్లో కొన్ని చోట్ల ఎన్సీ, పీడీపీ మద్దతుదారులు కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుప్కర్ రోడ్డు వైపు వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో జమ్మూ- కశ్మీర్‌లోని ప్రధాన పార్టీలన్నీ ఏకమై గుప్కర్ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.