Manipur: మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఇంటర్నెట్‌పై బ్యాన్‌ కొనసాగింపు

మణిపుర్‌లో నిన్నరాత్రి వేర్పాటువాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాను మరణించారు.

Updated : 06 Jun 2023 13:40 IST

ఇంటర్నెట్‌డెస్క్: మణిపుర్‌(Manipur)లో మరోసారి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. నిన్న అర్ధరాత్రి భద్రతాదళాలు, వేర్పాటు వాద గ్రూపు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బీఎస్‌ఎఫ్‌(BSF)కు చెందిన ఒక జవాను ప్రాణాలు కోల్పోగా.. అస్సాం రైఫిల్స్‌(Assam Rifles)కు చెందిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక భద్రతను పర్యవేక్షిస్తున్న సైన్యానికి చెందిన స్పియర్‌ కోర్‌ కమాండ్‌ ధ్రువీకరించింది. గాయపడ్డ జవాన్లను మెరుగైన వైద్యం కోసం తరలించారు. మణిపుర్‌లోని సుగ్ను, సెరు ప్రాంతంలో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు బీఎస్‌ఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌, స్థానిక పోలీసులు గస్తీ చేపట్టిన సమయంలో ఈ కాల్పులు మొదలయ్యాయి. ఈ దాడులను భద్రతా దళాలు తిప్పికొట్టాయని స్పియర్‌ కోర్‌ పేర్కొంది.

మరోవైపు సోమవారం ఉదయం రెండు వర్గాల మధ్య ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలోని కాంగ్‌చుప్‌ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఇంఫాల్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మణిపుర్‌లో హింసపై కేంద్రం ఆదివారం ఓ ఎంక్వైరీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి గువహాటి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజేయ్‌ లాంబ నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల 80 మంది మృతికి కారణమైన అల్లర్లపై ఈ కమిటీ దర్యాప్తు చేపట్టనుంది.

మరోవైపు మణిపుర్‌లో ఇంటర్నెట్‌ బ్యాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 10వ తేదీ వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకొంది. హింసాత్మక ఘటనలు మరింత వ్యాపించకుండా ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని సోమవారం సాయంత్రం వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని