Uttarakhand Rains: ఉత్తరాఖండ్‌లో వర్షబీభత్సం..34మంది మృతి

దేవభూమి ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో చోటుచేసుకున్న ఘటనల్లో 34మంది మరణించారని, ఐదుగురు.......

Published : 19 Oct 2021 21:55 IST

డెహ్రాడూన్‌: దేవభూమి ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాల ప్రభావంతో చోటుచేసుకున్న ఘటనల్లో ఇప్పటి వరకు 34 మంది మరణించగా.. ఐదుగురు గల్లంతైనట్టు సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇళ్లు కోల్పోయిన వారికి రూ.1.9లక్షల చొప్పున, మూగ జీవాలను కోల్పోయినవారికి సాధ్యమైనంత మేరకు సాయం చేస్తామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ అశోక్‌ కుమార్‌తో కలిసి సీఎం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మరోవైపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 15 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. 

నైనిటాల్‌ అతలాకుతలం..

భారీ వర్షాలకు నైనిటాల్‌ జిల్లా అతలాకుతలమైంది. వరద ఉద్ధృతికి నైనిటాల్‌ సరస్సు ఉప్పొంగడంతో సమీప గ్రామాలకు వరదనీరు పోటెత్తింది. దీంతో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. పలుచోట్ల రోడ్లపై నిలిచి ఉన్న వాహనాలు కొట్టుకుపోయాయి. హల్ద్వానీ ప్రాంతంలో గౌలా నది ఉప్పొంగడంతో ఆ నదిపై ఉన్న వంతెన కొంతమేరకు కొట్టుకుపోయింది.

రిసార్టులో చిక్కుకుపోయిన 100 మంది

ఉత్తరాఖండ్‌లో గత కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. వరదల ఉద్ధృతికి పలు చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక పర్యాటక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. భారీ వరదల కారణంగా కోసి నది ఉప్పొంగడంతో రాంనగర్-రాణిఖేట్ రోడ్‌లోని ఓ రిసార్ట్‌లో దాదాపు 100 మంది చిక్కుకున్నట్లు సమాచారం. వారిని కాపాడేందుకు సహాయక బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. నైనిటాల్‌లోని మాల్ రోడ్‌, నైనాదేవి దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతాలు నీటమునిగాయి. 

రైతులను ఆదుకుంటామన్న సీఎం

రాష్ట్రంలో పరిస్థితులపై విపత్తు నియంత్రణ అధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి సమావేశం నిర్వహించారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు తీసుకుంటోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రైతులకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి, నివేదికలను త్వరగా పంపాలని అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్మీ నుంచి మూడు హెలికాప్టర్లను వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు తెలిపారు. చార్‌ధామ్‌ యాత్రకు వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని