మూడు వారాల్లో 36శాతం కేసుల పెరుగుదల

దేశంలో కరోనా అదుపులోకి వస్తుందనుకున్న తరుణంలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొదటి నుంచీ కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న కేరళ, మహారాష్ట్రల్లో కరోనా తీవ్రంగా ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.

Published : 22 Feb 2021 20:52 IST

వెల్లడించిన ముంబయి నగరపాలక సంస్థ

ముంబయి: దేశంలో కరోనా అదుపులోకి వస్తుందనుకున్న తరుణంలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొదటి నుంచీ కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న కేరళ, మహారాష్ట్రల్లో కరోనా తీవ్రంగా ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ముంబయిలో గత మూడు వారాల్లో 36శాతం కేసులు పెరిగాయని బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. ప్రజల నిర్లక్ష్యంతో పాటు లోకల్‌ రైళ్ల అనుమతి, హోటళ్లు, మాల్స్‌ తెరవడం వంటి కారణాలతో కేసులు పెరుగుతున్నాయని బీఎంసీ అదనపు కమిషనర్‌ సురేశ్‌ అన్నారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి కేసుల్లో పెరుగుదల ఉందని ఆయన తెలిపారు. కరోనా ఆంక్షలు సడలించడంతో సామూహిక కార్యక్రమాలు ఎక్కువయ్యాయని ఆయన పేర్కొన్నారు. పాజిటివ్‌ వచ్చిన చాలా మందిలో లక్షణాలు కనిపించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు.

మరోవైపు నాగ్‌పూర్‌లో 33శాతం, అమరావతిలో 47శాతం, నాశిక్‌లో 23శాతం, అకోలాలో 55శాతం, యావత్మల్‌లో 48శాతం కేసులు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య  21,00,884కు చేరింది.
ఆదివారం వర్చువల్‌ సమావేశంలో సీఎం ఉద్దవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. ప్రజలు కరోనాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే రెండు వారాల్లో లాక్‌డౌన్‌ విధిస్తామన్నారు. కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కరోనా రెండో వేవ్‌ గురించి రాబోయే 15 రోజుల్లో తెలుస్తుందని ఆయన వివరించారు. కాగా పాజిటివ్‌ వచ్చిన నమూనాలను వేరియంట్లను గుర్తించేందుకు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని