కేంద్ర పోలీసు బలగాల్లో 36వేల మందికి కరోనా!

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని పోలీసు బలగాల్లో దాదాపు 36వేల మంది వైరస్‌ బారినపడగా వీరిలో 128మంది మృత్యువాతపడ్డట్లు తాజా నివేదిక స్పష్టంచేసింది. 

Updated : 28 Sep 2020 01:35 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అటు కేంద్ర పోలీసు బలగాలు వైరస్‌ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని పోలీసు బలగాల్లో దాదాపు 36వేల మంది వైరస్‌ బారినపడగా వీరిలో 128మంది మృత్యువాతపడ్డట్లు తాజా నివేదిక స్పష్టంచేసింది. ముఖ్యంగా సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎన్‌ఎస్‌జీతోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వైరస్‌ బారినపడినవారిలో ఉన్నారు. అయితే వీరిలో ఇప్పటికే 30వేల మంది కోలుకోగా మరో 6వేల క్రియాశీల కేసులు ఉన్నాయి.

వైరస్‌ బారినపడిన మొత్తం కేంద్ర పోలీసుల్లో ఎక్కువగా బీఎస్‌ఎఫ్‌ సిబ్బందే ఉన్నట్లు తాజా నివేదిక స్పష్టం చేసింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దులో విధులు నిర్వర్తించే బీఎస్‌ఎఫ్‌ జవాన్లలో ఇప్పటివరకు 10,636 మందిలో ఈ వైరస్‌ బయటపడింది. ఇక సీఆర్‌పీఎఫ్‌లో మరో 10,602మంది పోలీసులకు వైరస్‌ సోకగా, సీఐఎస్‌ఎఫ్‌లో 6466 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఐటీబీపీలో 3845, ఎస్‌ఎస్‌బీలో 3684, ఎన్‌డీఆర్‌ఎఫ్‌లో 514తోపాటు ఎన్‌ఎస్‌జీలో 250మందిలో వైరస్‌ బయటపడింది. అయితే వైరస్‌సోకిన కేంద్ర పోలీసుల్లో 52మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, బీఎస్‌ఎఫ్‌లో 29, సీఐఎస్‌ఎఫ్‌లో 28మంది చనిపోయారు. ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలలో తొమ్మిది మంది చొప్పున కరోనా సోకి ప్రాణాలు కోల్పాయారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ కేంద్ర పోలీసు బలగాలు మాత్రం విధుల్లోనే ఉన్నాయి. సెలవులు ముగించుకొని తిరిగి విధులకు హాజరయ్యే పోలీసులను కచ్చితంగా క్వారంటైన్‌లో ఉంచుతున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా వైరస్‌ సోకిన వారికి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 60లక్షలకు చేరువైంది. వీరిలో ఇప్పటివరకు 94వేల మంది మృత్యవాతపడ్డట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని