Covid: ముంబయిలో భారీగా పెరిగిన కేసులు.. బీఎంసీ అప్రమత్తం!

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కొవిడ్‌ మళ్లీ కోరలు చాస్తోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత తరుణంలో.. రోజువారీ కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో స్థానికంగా 3671 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటి...

Published : 30 Dec 2021 20:48 IST

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కొవిడ్‌ మళ్లీ కోరలు చాస్తోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో రోజువారీ కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో స్థానికంగా 3,671 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటి కేసుల (2510)తో పోలిస్తే ఇవి ఏకంగా 46 శాతం ఎక్కువ కావడం గమనార్హం. కేసుల సంఖ్య సైతం వారం వ్యవధిలో అయిదు రెట్లు పెరిగింది. గత శుక్రవారం నగరంలో 683 కేసులు బయటపడ్డాయి. మరోవైపు కొత్త వేరియంట్‌ వ్యాప్తిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. గురువారం రాష్ట్ర కొవిడ్ టాస్క్‌ఫోర్స్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహమ్మారి పరిస్థితులు, తీసుకోవాల్సిన పరిష్కార చర్యలపై చర్చించినట్లు సమాచారం.

నగరంలో భారీ ఎత్తున కేసులు బయటపడుతుండటంతో.. బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు తాజాగా మరోసారి 24 వార్డు స్థాయి వార్ రూంలను యాక్టివేట్‌ చేసింది. బాధితుల ట్రాకింగ్‌, ఆసుపత్రుల్లో చేరికలు, ఆక్సిజన్, మందుల అవసరాలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఇవి పర్యవేక్షిస్తాయి. అయితే, కేసులు పెరుగుతున్నప్పటికీ.. 90 శాతానికి పైగా లక్షణాలు లేనివేనని బీఎంసీ తెలిపింది. మరోవైపు కరోనా మూడో వేవ్‌.. మునుపటి రెండు వేవ్‌ల కంటే ప్రమాదకరంగా ఉండొచ్చని ముంబయి మేయర్ కిశోరి పెడ్నేకర్ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్ సంక్షోభం తగ్గుముఖం పట్టేవరకు తాను వివాహాలు, ఇతర సమావేశాలకు దూరంగా ఉంటానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని