Manipur : మణిపుర్‌ విద్యార్థుల హత్య కేసు.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ

మణిపుర్‌లో (Manipur) ఇద్దరు విద్యార్థుల హత్య ఘటన ఇటీవల కలకలం రేపింది. ఆ హత్యతో సంబంధమున్న నలుగురు నిందితులను సీబీఐ (CBI) తాజాగా అరెస్టు చేసింది. 

Updated : 01 Oct 2023 21:00 IST

ఇంఫాల్‌ : జాతుల మధ్య వైరంతో అట్టుడికిపోతున్న మణిపుర్‌లో (Manipur) ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైన విషయం ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దాంతో కోపోద్రిక్తులైన కొందరు విద్యార్థులు ఏకంగా ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్(Chief Minister N Biren Singh) నివాసం ముట్టడికి యత్నించారు. భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌, స్మోక్‌ బాంబ్స్‌ను వాడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ రెండు హత్యలతో సంబంధమున్న నలుగురు నిందితులను సీబీఐ (CBI) అరెస్టు చేసింది. మరో ఇద్దరు బాలికలను ఇంఫాల్‌లో అదుపులోకి తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా అరెస్టైన నలుగురిని వెంటనే అస్సాంలోని గువాహటీకి తరలించారు. 

₹300 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌.. ఇద్దరి అరెస్టు

హత్య కేసు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు, ఆర్మీ బలగాలు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించాయి. ఇంఫాల్‌కు 51 కిలోమీటర్ల దూరంలోని ఏజెన్సీ జిల్లా చురాచంద్‌పుర్‌లో గాలించారు. నిందితులు దొరికిన వెంటనే వారిని హుటాహుటిన ఎయిర్‌పోర్టుకు తరలించారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న సీబీఐ బృందాలు సాయంత్రం 5.45 ప్రాంతంలో వారిని ఇంఫాల్‌ నుంచి అస్సాంకు తరలించాయి. అరెస్టు సమాచారం తెలిసి కొన్ని అల్లరి మూకలు ఎయిర్‌పోర్టు దిశగా దూసుకెళ్లినట్లు సమాచారం. 

ఈ ఆపరేషన్‌కు రిటైర్డ్  కల్నల్ నెక్టార్ సంజెబామ్ నేతృత్వం వహించారు. గతంలో ఆయన ‘21 పారా’లో పని చేశారు. ఇటీవలే ఆయన సీనియర్‌ ఎస్పీగా(కొంబాట్) నియమితులయ్యారు. ఇద్దరు విద్యార్థుల అపహరణ, హత్యకు కారణమైన నిందితులను అరెస్టు చేశామని సీఎం బీరేన్‌ సింగ్‌ ట్విటర్‌లో ప్రకటించారు. నేరం చేసినవారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన అన్నారు. క్రూరమైన నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. 

జులైలో కనిపించకుండా పోయిన ఓ యువతి, ఓ యువకుల మృతదేహాల ఫొటోలు సెప్టెంబర్‌ 26న నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంటర్నెట్‌పై నిషేధాన్ని సడలించడంతో హత్యల విషయం వెలుగులోకి వచ్చింది. సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. హత్యకు గురైన మైనర్ల మృతదేహాలు మాత్రం ఇంకా లభించలేదు. యువతిని అత్యాచారం చేసిన తరువాతే హత్య చేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని