Corona Vaccine: 4 కోట్ల మంది కనీసం ఒక్కడోసూ తీసుకోలేదు: కేంద్రం

దేశవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది లబ్ధిదారులు (Beneficiaries) కనీసం ఒక్కడోసు కూడా తీసుకోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ వెల్లడించారు.

Published : 23 Jul 2022 01:53 IST

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

దిల్లీ: కరోనా వైరస్‌ను (Coronavirus) ఎదుర్కొనే వ్యాక్సిన్‌ పంపిణీ దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ దాదాపు 4 కోట్ల మంది లబ్ధిదారులు (Beneficiaries) కనీసం ఒక్కడోసు కూడా తీసుకోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ వెల్లడించారు. ఇప్పటివరకు ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాల ద్వారా 178,38,52,566 డోసులను (97.34శాతం) ఉచితంగా పంపిణీ చేశామన్నారు. దేశంలో ఇప్పటివరకు ఎంతమంది కరోనా వ్యాక్సిన్‌ (Coronavaccine) తీసుకోలేదో చెప్పాలని పలువురు సభ్యులు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

దేశంలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతోపాటు 60ఏళ్ల వయసుపైబడిన వారికి ప్రికాషన్‌ డోసు (Booster Dose) పంపిణీని ఈ ఏడాది మార్చిలోనే ప్రారంభించామని కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో 18 నుంచి 59ఏళ్ల వారికి జులై 15 నుంచి ఉచితంగానే పంపిణీ మొదలు పెట్టామన్నారు. ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ విస్తృత పంపిణీ కార్యక్రమాన్ని 75 రోజులపాటు కొనసాగించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

10-20శాతం మందిలో లాంగ్‌కొవిడ్‌

కరోనా నుంచి కోలుకున్న వారిలో దాదాపు 10 నుంచి 20శాతం మందిలో దీర్ఘకాలం పాటు వ్యాధి లక్షణాలు వేధిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి వెల్లడించారు. బాధితులు లాంగ్‌ కొవిడ్‌ (Long Covid) సమస్య ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ నివేదికలూ రుజువు చేస్తున్నాయన్నారు. అందులో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్ఞాపకశక్తి, నిద్ర సమస్యలు, దగ్గు, ఛాతి నొప్పి, నరాలు నొప్పులు, వాసన/రుచి కోల్పోవడం, ఆందోళన, జ్వరం వంటి లక్షణాలు ఉంటున్నాయని తెలిపారు. అయితే, ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను ఇదివరకే విడుదల చేశామని మంత్రి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని