150మంది సుప్రీంకోర్టు సిబ్బందికి పాజిటివ్..!

భారత అత్యున్నత న్యాయస్థానానికి వైరస్‌ తాకిడి మొదలైంది. దాదాపు 150 మంది సుప్రీంకోర్టు సిబ్బంది వైరస్‌ బారినపడినట్లు వెల్లడైంది.

Published : 09 Jan 2022 20:13 IST

న్యాయస్థాన ప్రాంగణంలోనే  టెస్ట్‌కేంద్రం ఏర్పాటు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య 20వేలకు చేరుకుంది. ఆస్పత్రులు, వైద్య సిబ్బంది భారీగా కొవిడ్‌ బారిన పడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పార్లమెంట్‌ కార్యాలయంలోనూ 400మంది వైరస్‌ బారినపడినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో భారత అత్యున్నత న్యాయస్థానానికి వైరస్‌ తాకిడి మొదలైంది.  దాదాపు 150 మంది సుప్రీంకోర్టు సిబ్బంది వైరస్‌ బారినపడినట్లు వెల్లడైంది.

న్యాయస్థానంలో మొత్తం 3వేల మంది సిబ్బంది ఉండగా వారిలో 150 (దాదాపు 5శాతం) మందికి ప్రస్తుతం వైరస్‌ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నాయి. ఇలా వైరస్‌ వ్యాప్తి పెరగడంతో న్యాయస్థానం ప్రాంగణంలోనే కొవిడ్‌ టెస్ట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సుప్రీంకోర్టు పాలనా విభాగం తెలిపింది. ఒమిక్రాన్‌ ప్రభావంతో వైరస్‌ విజృంభణ పెరిగిన నేపథ్యంలో లక్షణాలున్న వారు తప్పకుండా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ ఓ సర్క్యులర్‌ జారీ చేసింది.

దిల్లీలో కొవిడ్‌ ప్రభావం అధికంగా ఉన్న తరుణంలో జనవరి 3 నుంచి సుప్రీంకోర్టులో కేసుల విచారణ వర్చువల్‌ పద్ధతిలో జరుగనున్నట్లు న్యాయస్థానం ఇదివరకే ప్రకటించింది. రెండు వారాల పాటు ఈ విధానంలోనే కేసుల విచారణ జరుగనుందని పేర్కొంది. ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ ముంబయి, దిల్లీ వంటి ప్రధాన నగరాల్లో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది. శనివారం ఒక్కరోజే దిల్లీలో 20,181 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ పాజిటివిటీ రేటు 19.6శాతానికి పెరిగింది. అయినప్పటికీ ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తే లాక్‌డౌన్‌ అమలు చేయమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. కొవిడ్‌ ఆంక్షలు మాత్రం ఉంటాయని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని