Suicide Blast: పాక్‌ సైనిక పోస్టుపై ఆత్మాహుతి దాడి.. నలుగురు సిబ్బంది మృతి

పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ద్విచక్ర వాహనంపై దూసుకొచ్చిన ఉగ్రవాది తననుతాను పేల్చుకున్న ఘటనలో నలుగురు పాక్‌ పారామిలిటరీ గార్డ్స్‌ మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరో 17 మంది సిబ్బంది...

Published : 05 Sep 2021 22:01 IST

క్వెట్టా: పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ద్విచక్ర వాహనంపై దూసుకొచ్చిన ఉగ్రవాది తననుతాను పేల్చుకున్న ఘటనలో నలుగురు పాక్‌ పారామిలిటరీ గార్డ్స్‌ మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరో 17 మంది సిబ్బంది, ఇద్దరు పౌరులూ గాయపడ్డారని చెప్పారు. నగరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో క్వెట్టా- మస్తుంగ్‌ మార్గంలో చెక్‌పాయింట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. పేలుడు ధాటికి ముగ్గురు అక్కడికక్కడే మరణించారని, తీవ్ర గాయాలతో అనంతరం మరొకరు మృతి చెందినట్లు డీఐజీపీ అజహర్ అక్రమ్ వెల్లడించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఉగ్రవాద నిరోధక విభాగం సైతం ఈ దాడిని ధ్రువీకరించింది. 

ఖండించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌

ఈ ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్ ఏ తాలిబాన్‌ పాకిస్థాన్‌(టీటీపీ) ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ట్వీట్‌ చేశారు. బలోచిస్థాన్ హోం మంత్రి మీర్ జియావుల్లా లాంగోవ్ కూడా దాడిని ఖండించారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పాకిస్థాన్‌లో ప్రమాదకరమైన ఉగ్రసంస్థగా టీటీపీకి గుర్తింపు ఉంది. ఈ సంస్థ అక్కడ పలు భారీ దాడులకు పాల్పడింది.  2011లో కరాచీలోని అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి చేసింది. 2014లో ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌పై దాడి చేసి పిల్లలతో సహా 150 మందిని చంపేసింది. తాజాగా జులైలోనూ ఖైబర్‌ పఖ్తుంక్వా ప్రావిన్సులో తొమ్మిది మంది చైనీయులతోపాటు పలువురిని బలిగొన్న బస్సు దాడి వెనుక ఈ సంస్థ హస్తం ఉందని పాక్‌, చైనా ఆరోపించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని