బయట నుంచి చూస్తే కప్‌బోర్డ్‌.. లోపల మాత్రం ఉగ్ర స్థావరం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు జనావాసాల మధ్య నక్కేందుకు బంకర్లను నిర్మించుకొంటున్నారు. తాజాగా ఓ ఎన్‌కౌంటర్‌లో సైన్యం ఈ విషయాన్ని గమనించింది. 

Published : 08 Jul 2024 10:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్మూకశ్మీర్‌(J&K)లోని కుల్గామ్‌లో ఇటీవల జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. జనావాసాల మధ్యలో ఉగ్రవాదులు బంకర్లు ఏర్పాటుచేసుకొంటున్నట్లు గుర్తించారు.  చిన్నిగామ్‌ ఫీసల్‌లో శనివారం ఒకేచోట నలుగురు హిజ్బుల్‌ ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఈసందర్భంగా ఓ ఆశ్చర్యకరమైన అంశాన్ని దళాలు పసిగట్టాయి. ఓ ఇంట్లో ఉన్న కప్‌బోర్డ్‌లో ఉగ్రవాదులు ఏకంగా బంకర్‌ నిర్మించుకొన్నట్లు గ్రహించాయి. దీనిని పూర్తిగా కాంక్రీట్‌తో నిర్మించినట్లు సైనిక వర్గాలు చెబుతున్నాయి. చిన్నదిగా ఉన్నా సౌకర్యవంతంగా ఉన్నట్లు పేర్కొంది. దీనిలోకి వెళ్లడానికి బయట నుంచి చిన్న అల్మారా వంటి దానిలో ద్వారం ఏర్పాటుచేశారు. ఒక మనిషి పాక్కొంటూ బంకర్‌లోకి ప్రవేశించవచ్చు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ నేత ఒకరు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు,  ఓ పారాకమాండో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

కొన్నేళ్ల క్రితం ఉగ్రవాదులు మరుగుదొడ్ల కింద బంకర్లు ఏర్పాటు చేసుకొంటున్నట్లు సైన్యం గుర్తించింది. దీంతో వాటిపై దృష్టిపెట్టింది. 2019లో లస్సీపుర వద్ద సైన్యం ఒక ఇంటిని అనుమానంతో ఆరుసార్లు తనిఖీ చేసినా ఏ ఆధారం దొరకలేదు. చివరికి సెప్టిక్‌ ట్యాంక్‌ను తెరవగా.. ఇద్దరు ఉగ్రవాదులు అందులోని బంకర్‌లో దాక్కొన్నట్లు గుర్తించారు. చాలా స్థావరాలు కిచెన్లు, బెడ్‌రూమ్‌లు, డ్రాయింగ్‌ రూమ్‌ల మాటున ఉంటున్నట్లు గమనించారు. 

ఇటీవల ఉగ్రదాడుల వెనుక సైఫుల్లా..

ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్ర దాడుల వెనక లష్కరే నేత సైఫుల్లా సాజిద్‌ జట్‌ హస్తం ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. అతడిపై రూ.10 లక్షల రివార్డు కూడా ఉంది. అతడు పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్నాడు. భారత్‌కు చెందిన మహిళను పెళ్లి చేసుకొన్నాడు. ప్రస్తుతం అతడే లష్కర్‌ ఆపరేషనల్‌ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. సైఫుల్లా  భారత్‌లోని ఖాసీం అనే వ్యక్తితో టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో  అతడి కోసం వేట మొదలైంది. గత నెలలో బస్సుపై ఉగ్రదాడిలో కూడా సైఫుల్లా హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని