Tamil Nadu: తమిళనాడులో 40కి చేరిన కల్తీసారా మృతులు

తమిళనాడులో కల్తీసారా బారిన పడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురం కల్తీసారా ఘటనలో గురువారానికి 40 మంది కన్నుమూశారు.

Published : 21 Jun 2024 06:18 IST

మిథనాల్‌ కలిపిన మద్యమే ఘోరానికి కారణం!
ఘటనపై ఏక సభ్య కమిటీ వేసిన రాష్ట్ర ప్రభుత్వం

సేలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-వేళచ్చేరి: తమిళనాడులో కల్తీసారా బారిన పడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురం కల్తీసారా ఘటనలో గురువారానికి 40 మంది కన్నుమూశారు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. పలు ఆసుపత్రుల్లో 109 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. కల్తీసారా ప్రభావంతో కొందరికి కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలమవుతుండటంతో నిపుణులైన వైద్యులను రంగంలోకి దింపారు. విళుపురం, తిరువణ్ణామలై, తిరుచ్చి, సేలం తదితర జిల్లాల పరిధిలోని వైద్య కళాశాలల వైద్యుల్ని తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కుటుంబ పెద్దలను కల్తీసారా బలి తీసుకోవడంతో కరుణాపురం, చుట్టుపక్కల గ్రామాల్లో రోదనలు మిన్నంటుతున్నాయి. నిరసనలు పెల్లుబుకుతుండటంతో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం 1,000 మంది పోలీసుల్ని రంగంలోకి దించింది.

మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

అంత్యక్రియలకు వెళ్లి మద్యపానం..: కరుణాపురంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లినవారు అక్కడ అందుబాటులో ఉన్న సారాను తాగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వారిలోనే కొందరు మృత్యువాతపడి, మరికొందరు బాధితులుగా మారి ఆసుపత్రుల్లో ఉన్నారు. కల్తీ సారాలో కలిపిన మిథనాల్‌ కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దర్యాప్తును సీబీసీఐడీకి అప్పగించి, మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరిపించేందుకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కళ్లకురిచ్చి కలెక్టర్‌ను బదిలీ చేయగా ఎస్పీని సస్పెండ్‌ చేశారు. మరో 9 మంది ఉన్నతాధికారుల్ని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. మిథనాల్‌తో సారా అమ్ముతున్న విక్రయదారుల్ని అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కల్తీసారా వ్యవహారంపై విచారణ జరపాలని మద్రాస్‌ హైకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. కళ్లకురిచ్చి మరణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమిళనాడు అసెంబ్లీలో గురువారం సంతాపం పాటించారు. గవర్నర్‌ ఆర్‌ఎన్‌.రవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 22న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని భాజపా రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు