Assam: అస్సాంలో గూఢచర్యం.. పాక్‌ ఏజెంట్లకు సిమ్‌కార్డుల సరఫరా..!

అస్సాంలో భారత రక్షణ దళాల కీలక సమాచారాన్ని పాక్‌కు అందజేస్తున్న ఓ ముఠాను పట్టు్కొన్నారు. వీరు భారత్‌లో సిమ్‌కార్డులు సేకరించి.. పాక్‌ ఏజెంట్లకు అందిస్తున్నట్లు గుర్తించారు. 

Published : 08 Mar 2023 18:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థానీ ఏజెంట్లకు సిమ్‌కార్డులు సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అస్సాంలో అరెస్టు చేశారు. నాగౌన్‌, మోరిగాన్‌ జిల్లాల్లోని ఈ అరెస్టులు జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. వీరి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్లు, ఇతర ప్రమాదకర మెటీరియల్‌ స్వాధీనం చేసుకొన్నారు. విదేశీ దౌత్యకార్యాలయానికి రక్షణశాఖ కీలక సమాచారం చేరవేసేందుకు వినియోగిస్తున్న ఓ హ్యాండ్‌ సెట్‌ కూడా దీనిలో ఉన్నట్లు గుర్తించారు.

ఈ ఘటనపై అస్సాం రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతినిధి ప్రశాంత భుయాన్‌ మాట్లాడుతూ ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఇతర మార్గాల్లో లభించిన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించినట్లు వెల్లడించారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 10 మంది వ్యక్తులు వివిధ సర్వీసు ప్రొవైడర్ల నుంచి తప్పుడు మార్గాల్లో సిమ్‌కార్డులను కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. వీటిల్లో కొన్ని పాకిస్థాన్‌ ఏజెంట్లకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం నిర్వహించిన ఆపరేషన్‌లో అష్కిల్‌ ఇస్లాం, బొడోరుద్దీన్‌, మిజనూర్‌ రహ్మాన్‌, వాహిదుజ్‌ జమాన్‌లను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వీరి వద్ద నుంచి 18 మొబైల్‌ ఫోన్లు, 136 సిమ్‌కార్డులు, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌, హైటెక్‌ సీపీయూ, బర్త్‌ సర్టిఫికెట్‌లు, పాస్‌బుక్స్‌, ఫొటోలు ఉన్నాయి. నిందితులను ఇంటరాగేషన్‌ చేయగా వారిలో ఒకరు రక్షణశాఖ సమాచారాన్ని పాకిస్థాన్‌కు  ఇస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అష్కిల్‌ ఇస్లాం అనే వ్యక్తి పాకిస్థాన్‌కు వాట్సాప్‌ కాల్స్‌ చేస్తున్నట్లు తేలింది. అతడు భారత రక్షణ దళాల కీలక సమాచారం పాకిస్థాన్‌కు అందించినట్లు గుర్తించారు. అతడు వాడుతున్న మొబైల్‌కు రెండు ఐఎంఈఐ నెంబర్లు కనుగొన్నారు. వీరిని ఇంటెలిజెన్స్‌ బ్యూరో కూడా విచారించనున్నదని పోలీసు అధికారులు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు