terror attack: కశ్మీర్లో ఉగ్ర ఘాతుకం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. సైనిక వాహనంపై ఆకస్మిక దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. మరో ఐదుగురు సైనిక సిబ్బందికి గాయాలయ్యాయి.

Published : 09 Jul 2024 03:43 IST

సైనిక వాహనంపై గ్రనేడ్‌ విసిరి కాల్పులు
అమరులైన ఐదుగురు జవాన్లు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. సైనిక వాహనంపై ఆకస్మిక దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. మరో ఐదుగురు సైనిక సిబ్బందికి గాయాలయ్యాయి. కఠువా జిల్లాలోని మారుమూల ప్రాంతం మాచేడీలో సోమవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. పది మంది జవాన్ల బృందం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మాచేడీ- కిండ్లీ- మల్హార్‌ రోడ్డు మార్గంలో ట్రక్కులో వెళ్తూ గస్తీ నిర్వహిస్తుండగా, ముష్కరులు ఒక్క ఉదుటున వాహనం పైకి గ్రనేడ్‌ విసిరారు. ఈ హఠాత్పరిణామం నుంచి సైనికులు తేరుకోకముందే కాల్పులకు పాల్పడ్డారు. దీంతో వాహనంలో ఉన్న 10 మందికీ గాయాలయ్యాయి. వారిలో ఐదుగురు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఒకరు జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి ఉన్నట్లు వెల్లడించారు. గాయపడిన జవాన్లకు ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాల్పుల అనంతరం పోలీసులు, పారామిలిటరీ దళం సాయంతో సైనిక సిబ్బంది ఎదురుదాడికి దిగడంతో ఉగ్రవాదులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు అధికారులు చెప్పారు. వెంటనే అదనపు బలగాలు అక్కడికి చేరుకొని ముష్కరులను మట్టుబెట్టడానికి ఆపరేషన్‌ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో భద్రతా దళాలు, ముష్కరుల మధ్య కాల్పులు జరుగుతున్నట్లు వివరించారు. ముగ్గురు ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోందని, వారి వద్ద భారీ స్థాయిలో ఆయుధాలు ఉండొచ్చని చెప్పారు. వారు ఈమధ్యే సరిహద్దుల్లో నుంచి దేశంలోకి చొరబడినట్లు భావిస్తున్నామన్నారు. తామే ఈ దాడికి పాల్పడినట్లు పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ అనుబంధ ముఠా అయిన కశ్మీర్‌ టైగర్స్‌ ప్రకటించుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని