Indian Army: ఉగ్రవాదుల గ్రనేడ్‌ దాడి వల్లే ఐదుగురు సైనికుల సజీవదహనం!

ఉగ్రవాదుల గ్రనేడ్‌ దాడి వల్లే ట్రక్కులో మంటలు వ్యాపించి ఐదుగురు సైనికులు సజీవదహనమైనట్టు సైనిక అధికారులు తెలిపారు.

Updated : 20 Apr 2023 21:08 IST

దిల్లీ:  జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఆర్మీ ట్రక్కు పేలి ఐదుగురు సైనికులు మృతిచెందిన ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు సైన్యం నిర్ధారించింది. పిడుగు పాటు వల్లే ట్రక్కులో మంటలు చెలరేగి ఉంటాయని తొలుత భావించినప్పటికీ.. ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్‌ దాడులు చేయడం వల్లే ఈ విషాదం చోటుచేసుకున్నట్టు సైనిక అధికారులు తెలిపారు. బింభేర్‌ గలి నుంచి పూంఛ్‌ జిల్లాలోని సాంగియోట్‌ వైపు వెళ్తుండగా మధ్యాహ్నం 3గంటల సమయంలో జరిగిన దుర్ఘటనలో ఐదుగురు జవాన్లు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

భారీ వర్షాలు, విజిబులిటీ సరిగా లేకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్న గుర్తు తెలియని ఉగ్రవాదులు మన సైనికులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకొని గ్రనేడ్లతో మెరుపుదాడికి దిగారని సైనిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సైనికుడిని చికిత్స కోసం రాజౌరిలోని సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. 

పిడుగు పాటు వల్లే ఈ ఘటన చోటుచేసుకుంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ అధికారులు దీని వెనుక ఉగ్రవాదుల హస్తంఏమైనా ఉందా? అనే కోణంలోనూ ఆరా తీశారు. దీంతో ఈ విషాదం వెనుక ఉగ్రకుట్రలు ఉన్నట్టు నిర్థారణకు వచ్చినట్టు సైన్యం తెలిపింది.  ఇటీవల పంజాబ్‌లోని అత్యంత కీలకమైన బఠిండా సైనిక స్థావరంలో జరిగిన కాల్పుల ఘటన మరవకముందే ఈ విషాదం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని