కోయంబేడులో మళ్లీ కరోనా కలకలం!

ప్రపంచంలో అతి పెద్ద హోల్‌ సేల్‌ మార్కెట్లలో ఒకటైన కోయంబేడులో కొవిడ్‌ కలవరం మళ్లీ మొదలైంది. రెండు వారాల క్రితమే తెరుచుకున్న ఈ మార్కెట్లో సోమవారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో 50మందికి.......

Published : 13 Oct 2020 01:27 IST

చెన్నై: ఆసియాలో అతి పెద్ద హోల్‌ సేల్‌ మార్కెట్లలో ఒకటైన కోయంబేడులో కొవిడ్‌ కలవరం మళ్లీ మొదలైంది. రెండు వారాల క్రితమే తెరుచుకున్న ఈ మార్కెట్లో సోమవారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో 50మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. వైరస్‌ సోకినవారిలో ఎక్కువమంది విక్రేతలే ఉన్నట్టు తెలిపారు. మొత్తం 3500 శాంపిల్స్‌ పరీక్షించగా.. 50మందికి పాజిటివ్‌గా తేలిందని వివరించారు. రోజూ దాదాపు 200మందికి పరీక్షలు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. సరకుతో వాహనాలు వస్తున్నందున మార్కెట్‌లో నిత్యం క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నట్టు చెన్నై పురపాలక శాఖ అధికారులు తెలిపారు. విక్రేతలకు నిరంతరం కొవిడ్‌ టెస్ట్‌లు చేసేందుకు వీలుగా నాలుగు బృందాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నామన్నారు. మే నెలలో ఈ మార్కెట్‌లో పెద్ద ఎత్తున కొవిడ్‌ పాజిటివ్‌లు వచ్చాయి. దేశంలో ఇదో పెద్ద హాట్‌స్పాట్‌గా మారడంతో మార్కెట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. అయితే, హోల్‌ సేల్‌ వర్తకుల ఇబ్బందుల దృష్ట్యా మార్కెట్లో పాక్షికంగా 200 దుకాణాలు తెరిచేందుకు అధికారులు అనుమతిచ్చారు.

మరోవైపు, తమిళనాడులో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 80,162 శాంపిల్స్‌ పరీక్షించగా.. 4879 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే, మరో 62మంది ఈ వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,61,264కి పెరిగింది. వీరిలో 6,07,203 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 10,314 మంది మృతిచెందారు. ప్రస్తుతం 43,747 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని