50%మంది మాస్క్‌ పెట్టుకోవట్లేదు: కేంద్రం

దేశంలో విజృంభిస్తున్న కరోనా కట్టడికి మాస్క్‌ ధరించడం తప్పనిసరంటూ వైద్యరంగ నిపుణులు, ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తున్నా దేశంలో సగం మంది (50శాతం) ఇంకా మాస్క్‌లు పెట్టుకోవడంలేదని.....

Updated : 20 May 2021 20:15 IST

దిల్లీ: దేశంలో విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి మాస్క్‌ ధరించడం తప్పనిసరంటూ వైద్యరంగ నిపుణులు, ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తున్నా అనేకమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో సగం (50శాతం)మంది ఇంకా మాస్క్‌లు పెట్టుకోవడంలేదని కేంద్రం వెల్లడించింది. మాస్క్‌లు ధరిస్తున్నవారిలో కూడా 64శాతం మంది ముక్కును కప్పి ఉంచేలా సరిగా పెట్టుకోవడంలేదని ఓ అధ్యయనంలో తెలిందని పేర్కొంది. 20 శాతం మంది గడ్డం దగ్గరకు మాస్క్‌ తీసుకొచ్చి ఉంచుతున్నారని, మరో 2శాతం మంది మెడ దగ్గర ఉంచుతున్నట్టు ఆందోళన వ్యక్తంచేసింది. కేవలం 14 శాతం మంది మాత్రమే మాస్క్‌లు సరిగా పెట్టుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వారు మాత్రమే వైరస్‌ ప్రవేశించకుండా పకడ్బందీగా ముక్కు, నోరు, గడ్డాన్ని కప్పి ఉంచేలా మాస్క్‌లు పెట్టుకొంటున్నారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియాతో మాట్లాడారు. దేశంలో లక్ష కన్నా ఎక్కువ యాక్టివ్‌ కేసులు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. 50వేల నుంచి లక్ష యాక్టివ్‌ కేసులు 9 రాష్ట్రాల్లో; 50వేలకు పైగా క్రియాశీల కేసులు 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నట్టు వివరించారు. కర్ణాటక, బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో 25శాతం పాజిటివిటీ రేటు ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా వ్యాప్తికి కళ్లెం వేయాలంటే భౌతికదూరం పాటించడంతో పాటు మాస్క్‌లు ధరించడం అవసరమని కేంద్రం విజ్ఞప్తి చేసింది. 

జూన్‌ నెలాఖరుకు రోజుకు 45లక్షల టెస్ట్‌లు..

ఈ నెలాఖరుకు రోజుకు సగటున 25లక్షల పరీక్షలు నిర్వహించడమే లక్ష్యమని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బలరాం భార్గవ వెల్లడించారు. జూన్‌ ఆఖరు నాటికి పరీక్షల సామర్థ్యాన్ని 45లక్షలకు పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి మధ్య కాలం నాటితో పోలిస్తే సగటున రోజువారీ పరీక్షలు గత 12 వారాల్లో 2.3 రెట్లు పెరిగాయన్నారు. గత రెండు వారాలుగా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు వివరించారు. భారీ సంఖ్యలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేయడం వల్ల త్వరగా ఫలితం రావడంతో పాటు రోగులను వీలైనంత తొందరగా ఐసోలేట్‌ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇంటివద్దే కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే ఒక కంపెనీ దరఖాస్తు చేసుకొందని, మరో వారంలోగా మరో మూడు రాబోతున్నాయని వెల్లడించారు. మూడు, నాలుగు రోజుల్లోనే హోమ్‌ టెస్టింగ్‌ కిట్‌లు మార్కెట్లో అందుబాటులోకి వస్తాయన్నారు.

జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నాయ్‌..

దేశంలో 25శాతం కన్నా ఎక్కువగా పాజిటివిటీ రేటు ఏడు రాష్ట్రాల్లో ఉండగా.. 15శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు 22 రాష్ట్రాల్లో; 5శాతం నుంచి 15శాతం వరకు పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాలు 13; ఒకే ఒక్క రాష్ట్రంలో 5శాతం కన్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉందని కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా లక్షద్వీప్‌లో 52.6శాతం పాజిటివిటీ రేటు ఉండగా.. గోవాలో 37%, పుదుచ్చేరిలో 34.9%; బెంగాల్‌లో 30.8%, కర్ణాటక 29.9%, సిక్కిం 26.4%, కేరళ 26.1%, ఏపీ 24.9 %గా పాజిటివిటీ రేటు ఉందని వివరించింది. అలాగే, గత కొన్నివారాలుగా అనేక జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. జిల్లాల్లో వారం వారం టెస్టులు పెరగ్గా.. పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.  పాజిటివ్‌ కేసులు తగ్గుతున్న జిల్లాల సంఖ్య 210 నుంచి 303కి పెరిగిందని చెప్పారు.

దేశంలో అత్యధిక కేసులు వస్తున్న రాష్ట్రాలివే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని