Passport Services: ‘రానున్న మూడు వారాల్లో 500 పాస్‌పోర్ట్‌ మేళాలు!’

2014లో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి పాస్‌పోర్ట్‌ సేవల్లో దాదాపు 500 శాతం మెరుగుదల నమోదైందని కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ వెల్లడించారు. పాస్‌పోర్ట్‌ల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు విదేశీ వ్యవహారాలశాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

Published : 09 Dec 2022 18:49 IST

దిల్లీ: కేంద్రంలో 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాస్‌పోర్ట్‌ సేవల్లో(Passport Services) దాదాపు 500 శాతం మెరుగుదల నమోదైందని కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ వెల్లడించారు. పాస్‌పోర్ట్‌ల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు విదేశీ వ్యవహారాలశాఖ(MEA) నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పాస్‌పోర్ట్‌ మేళాలపై అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం దాదాపు 3.2 కోట్ల మంది భారతీయులు లేదా భారత సంతతికి చెందిన వారు విదేశాల్లో నివసిస్తున్నారని చెప్పారు. విదేశాంగశాఖ తరఫున వారందరికీ సేవలు అందుతున్నాయన్నారు.

‘గత ఎనిమిదేళ్లలో దేశంలో పాస్‌పోర్ట్ సేవలు చాలా మెరుగుపడ్డాయి. దాదాపు 500 శాతం వరకు ఉంది. 2014కు ముందు స్థానికంగా పాస్‌పోర్ట్ దరఖాస్తులను ప్రాసెస్ చేసే కార్యాలయాల సంఖ్య 110 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 550కి పైగా చేరుకుంది’ అని మంత్రి చెప్పారు. పాస్‌పోర్ట్‌ల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి, డిమాండ్‌ను తీర్చడానికి విదేశాంగశాఖ నిర్విరామంగా పని చేస్తోందని తెలిపారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్‌లు, వారాంతాల్లో మేళాలను నిర్వహించడంతోపాటు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇలా ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు మొత్తం 234 పాస్‌పోర్టు మేళాలు నిర్వహించామని.. రానున్న మూడు వారాల్లో మరో 500 మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఏ ఒక్కరి పాస్‌పోర్ట్‌ దరఖాస్తు కూడా తిరస్కరణకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. పాస్‌పోర్ట్ సేవాకేంద్రాల ఏర్పాటు విషయంలో ప్రతిపక్ష ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలపై విదేశాంగశాఖ వివక్ష చూపుతోందా అనే ప్రశ్నకు మురళీధరన్ స్పందిస్తూ.. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు, విపక్ష ఎంపీల ప్రాంతాలకూ కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సాయం అందజేస్తోందని తెలిపారు. కేరళలో కాంగ్రెస్ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తానే పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించినట్లు మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని