Corona:కర్ణాటకలో ఒకే రోజు 50వేల కేసులు 

కరోనా సెకండ్‌ వేవ్‌ కర్ణాటకను కుదిపేస్తోంది. రోజురోజుకీ వైరస్‌ ఉద్ధృత రూపం దాల్చడంతో బెంగళూరు నగరం వణుకుతోంది. గతంలో ఎన్నడూ.....

Updated : 05 May 2021 22:12 IST

బెంగళూరు: కరోనా సెకండ్‌ వేవ్‌ కర్ణాటకను కుదిపేస్తోంది. రోజురోజుకీ వైరస్‌ ఉద్ధృత రూపం దాల్చడంతో బెంగళూరు నగరం వణుకుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజులోనే కర్ణాటకలో 50వేలకు పైగా కొత్త కేసులు, 346 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో దాదాపు సగం బెంగళూరు నగరంలోనే రావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24గంటల వ్యవధిలో 1,55,224 శాంపిల్స్‌ పరీక్షించగా..  50,112 మందిలో వైరస్‌ వెలుగు చూసింది. అలాగే, 26,841మంది కోలుకున్నారు. ఒక్క బెంగళూరు నగరంలో బుధవారం 23,106 కేసులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,21,95294 శాంపిల్స్‌ పరీక్షించగా.. 17,41,046మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 12,36,854మంది కోలుకోగా.. 16,884మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం 4,87,288 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 32.28శాతం ఉండగా.. మరణాల రేటు 0.69శాతంగా ఉంది.

కర్ణాటకలో ఏప్రిల్‌ 27 నుంచి మే 12వరకు పాక్షిక లాక్‌డౌన్‌ పేరుతో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్‌ వ్యాప్తి వాయువేగంతో కొనసాగుతుండటం కలవరపెడుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు పెరగడంతో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని యడియూరప్ప సర్కార్‌ యోచిస్తోంది. 

మహారాష్ట్రలో భారీగా మరణాలు

మరోవైపు, మహారాష్ట్రలో కొత్త కేసులు కాస్త తగ్గుతున్నప్పటికీ.. మరణాలు భారీగా పెరుగుతున్నాయి.  ఒక్కరోజే 920మంది కొవిడ్‌తో మృతిచెందారు. గడిచిన 24గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 57,640 కొత్త కేసులు నమోదయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని