Tamil Nadu: ఊరంతా వల్లకాడు

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

Updated : 22 Jun 2024 04:46 IST

తమిళనాడు కల్తీసారా సంఘటనలో 52కు చేరిన మరణాలు
గంటల వ్యవధిలో దంపతుల మరణానికి కల్తీసారా కారణం కాదన్న కలెక్టర్‌ ప్రకటనే పెను విషాదానికి కారణమా?
అత్యవసర విభాగాల్లో చావుబతుకుల మధ్యే బాధితులు
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై హైకోర్టు మండిపాటు

కరుణాపురంలో ఇంటింటికీ వెళ్లి మద్యం తాగేవారిపై ఆరా తీస్తున్న వైద్య సిబ్బంది

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-వేళచ్చేరి: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం చికిత్స పొందుతూ 52 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రుల్లో 113 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో సుమారు 30 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కల్తీసారా విషయంలో కళ్లకురిచ్చి జిల్లా ఉన్నతాధికారులు తొలుత చేసిన నిర్లక్ష్యపు ప్రకటనలు కరుణాపురం గ్రామాన్ని వల్లకాడుగా మార్చాయన్న ఆరోపణలున్నాయి. కల్తీసారా దుర్ఘటన, వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోందని  హైకోర్టు తప్పుపట్టింది. 

కళ్లకురిచ్చి ఆసుపత్రిలోనే 28 మంది మృత్యువాత

చికిత్స పొందుతున్న వారిలో పలువురు కంటిచూపు కోల్పోయారు. మిథనాల్‌ కలిపిన సారా తాగడంతో చాలా మంది అవయవాలు దెబ్బతిన్నాయి. మొత్తం మృతుల్లో కళ్లకురుచ్చి ప్రభుత్వాసుపత్రిలోనే 28 మంది ప్రాణాలు వదిలారు. ఇక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేవు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన నిపుణుల చికిత్స అందేలోపే బాధితుల ఆరోగ్య పరిస్థితి చేజారుతోంది. ఇక్కడినుంచి ప్రధాన నగరాలు దూరంగా ఉండటమూ సకాలంలో వైద్యం అందకపోవడానికి కారణమైంది.

తొలి ప్రాణం పోయినప్పటినుంచే నిర్లక్ష్యం..!

కరుణాపురంలో కల్తీసారా తాగి తొలుత దివ్యాంగుడైన పెయింటర్‌ సురేష్‌ (35) చనిపోయారు. ఇదే సారా తాగిన ఆయన భార్య వడివుక్కరసి గంటల వ్యవధిలోనే కన్నుమూశారు. ఇద్దరిదీ సాధారణ మరణమేనని వైద్యులు ప్రకటించారని సురేష్‌ తమ్ముడు తెలిపారు. కల్తీసారా వల్లే దంపతులు చనిపోయారని వైద్యులు గుర్తించి అప్రమత్తం చేస్తే మిగిలినవారైనా బతికేవారని వాపోయారు. దంపతుల మరణాలకు అసలు కారణాలను వైద్యులు గుర్తించలేకపోయారా? లేదా అధికారులు దాచిపెట్టారా? అనే అనుమానాలు వస్తున్నాయి. భార్యాభర్తలవి కల్తీసారా మరణాలు కావని స్థానిక కలెక్టర్‌ ధ్రువీకరించారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన ప్రకటించాకే తమ వారు సారా తాగారని బాధితులు, మృతుల కుటుంబీకులు చెబుతున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కలెక్టర్‌ను బదిలీ చేశారు. ఎస్పీని సస్పెండ్‌ చేశారు. కళ్లకురిచ్చిలో కల్తీసారా విక్రేతల నుంచి పోలీసులకు మామూళ్లు వెళ్తుంటాయని బాధితులు ఆరోపిస్తున్నారు. 

బాధితులు, పోలీసులతో కళ్లకురిచ్చి ఆసుపత్రి  అత్యవసర విభాగం వద్ద హడావుడి

పుణ్యముంటుంది.. సారా వద్దయ్యా

తమకు జరిగిన నష్టం తీర్చలేనిదంటూ బాధిత కుటుంబీకులు రోదిస్తున్నారు. ‘మీకు పుణ్యముంటుంది.. దయచేసి సారా దుకాణాలను మూయించండి. లేకపోతే భవిష్యత్తు లేదు’ అంటూ కొత్తగా కనిపించిన వారందరినీ కరుణాపురం వాసులు వేడుకుంటున్నారు. అన్నీ కోల్పోయాక ప్రభుత్వం పరిహారమిస్తామంటే ఏం ప్రయోజనమని రోదిస్తున్నారు. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వెళితే ఈ దుర్ఘటన తప్పేదని వాపోతున్నారు. ఊళ్లో 15 ఏళ్ల పిల్లల నుంచి పండుటాకుల వరకు సారాకు బానిసలయ్యారని వివరిస్తున్నారు. పొదుపు సొమ్ము, బంగారాన్ని బలవంతంగా తీసుకెళ్లేవారని మహిళలు వాపోతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని కొత్తగా నియమితుడైన జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ భరోసానిచ్చారు.

ఏకసభ్య కమిషన్‌ విచారణ

కరుణాపురంలో ఆటోలు, ద్విచక్రవాహనాల్లో విక్రయించిన కల్తీసారా తాగి 165 మంది బాధితులయ్యారు. సంఘటనలో ప్రాథమికంగా నిందితుడిగా భావిస్తున్న చిన్నదురైని సీబీసీఐడీ అదుపులోకి తీసుకుంది. కన్నుకుట్టి అలియాస్‌ గోవిందరాజ్, ఆయన భార్య విజయ, మరొకరు దామోదరంను పోలీసులు రిమాండ్‌కు పంపారు. వారి వద్ద దొరికిన 200 లీటర్ల సారాలో మిథనాల్‌ కలిపిన ఆనవాళ్లున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏకసభ్య కమిషన్‌ సభ్యుడు జస్టిస్‌ గోకుల్‌దాస్‌ శుక్రవారం గ్రామంలో బాధితులతో మాట్లాడారు.

కళ్లకురిచ్చి జిల్లాను ఆనుకునే విళుపురం జిల్లా ఉంది. ఈ జిల్లాలోని విక్రవాండి అసెంబ్లీ స్థానానికి జులై 10న ఉపఎన్నిక జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ పెద్దలు కొందరు నిజాలు వెల్లడవకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

తప్పుపట్టిన హైకోర్టు

కల్తీసారా, వైఫల్యాలపై అన్నాడీఎంకే వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మద్రాస్‌ హైకోర్టు విచారించింది. దుర్ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోందని జస్టిస్‌ డి.కృష్ణకుమార్, జస్టిస్‌ కె.కుమరేశ్‌బాబు ధర్మాసనం అభిప్రాయపడింది. గతేడాది ఇదే తరహా సంఘటన జరిగినప్పటికీ గుణపాఠాలు ఎందుకు నేర్చుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మనుషుల ప్రాణాలపట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని, చర్యల విషయంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది.

మిథనాల్‌ పుదుచ్చేరి నుంచి సరఫరా అయినట్లు తెలిసిందని సీఎం స్టాలిన్‌ శాసనసభలో వెల్లడించారు. బాధ్యులను వదలబోమని ప్రకటించారు. కల్తీసారా దుర్ఘటనపై విపక్ష ఏఐడీఎంకే, ఇతర సభ్యులు ఆందోళన చేశారు. 

హైదరాబాద్‌ నుంచి కళ్లకురిచ్చికి మిథనాల్‌

కల్తీసారా తయారీకి వాడిన మిథనాల్‌ను తెలంగాణనుంచి తెచ్చినట్లు సీబీసీఐడీ విచారణలో వెలుగు చూస్తోంది. హైదరాబాద్‌ నుంచి చెన్నై, పుదుచ్చేరికి రైళ్లలో తరలించి అక్కడినుంచి సమీపంలోని వివిధ జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. మిథనాల్‌ విక్రయానికి కారకులైన వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. గతేడాది విళుపురం జిల్లా మరక్కాణంలో కల్తీసారా తాగి 22 మంది చనిపోయారు. అప్పుడూ మిథనాలే కారణమని తేల్చారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని