
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 53 మంది దుర్మరణం
చియాపాస్: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వలసదారులను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రక్కు.. పాదచారుల రెయిలింగ్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 53 మంది దుర్మరణం చెందగా.. మరో 54 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దక్షిణ మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో పాటు ట్రక్కు ఓవర్‌లోడ్ కారణంగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
దక్షిణ మెక్సికోలో వలసదారుల అక్రమరవాణా ఘటనలు తరచూ జరుగుతుంటాయి. పొరుగు దేశాల నుంచి అనేక మంది వలసదారులు ఇలా అధికారుల కళ్లుగప్పి మెక్సికో గుండా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా ప్రమాదానికి గురైన ట్రక్కు కూడా ఇలాంటి తరహాదే. కార్గో ట్రక్కులో వలసదారులను తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో వాహనంలో కనీసం 107 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రక్కు అతివేగంతో పాటు ఓవర్‌లోడ్ అవడంతో అదుపుతప్పి పాదచారుల రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బోల్తాపడింది.
ఈ ఘటనలో 53 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయకసిబ్బంది ట్రక్కులో నుంచి కొంతమంది వలసదారులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ట్రక్కులో ఇంకా ఎక్కువ మందే ఉండి ఉంటారని, ప్రమాదం జరిగిన తర్వాత అధికారులకు భయపడి పారిపోయినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.