Petrol Bunk:ట్యాంక్‌ కెపాసిటీ 50 లీటర్లు...కానీ 57 లీటర్లు పట్టారంటా! పెట్రోల్‌ బంక్‌ నిర్వాకం

కారులో ఇంధనం పట్టే సామర్థ్యం కంటే ఎక్కువ పోసినట్లు పెట్రోల్‌ బంకు (Petrol Bunk) నిర్వాహకులు బిల్లు ఇచ్చిన ఘటన ఓ హైకోర్టు న్యాయమూర్తికే (High Court Judge) ఎదురయ్యింది. దీంతో కంగుతున్న ఆయన.. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ బంకును సీజ్‌ చేశారు.

Published : 12 Feb 2023 16:29 IST

భోపాల్‌: సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా.. పలు చోట్ల పెట్రోల్‌ బంకులు (Petrol Bunk) మోసాలకు పాల్పడుతుండటం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ హైకోర్టు న్యాయమూర్తికే (High Court Judge) ఊహించని సంఘటన ఎదురయ్యింది. 50 లీటర్ల పెట్రోల్‌ సామర్థ్యం కలిగిన కారులో 57 లీటర్లు నింపినట్లు ఇచ్చిన బిల్లు చూసి కంగుతిన్నారు. విషయాన్ని వెంటనే జిల్లా అధికారులకు తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. సదరు పెట్రోల్‌ బంకును సీజ్‌ చేయడంతోపాటు ఇతర బంకులపైనా దాడులు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని జబల్‌పూర్‌లో ఇది చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి ఇటీవల కారులో వెళ్తున్న సమయంలో ఓ పెట్రోల్‌ బంకులో ఆగారు. తమ కారు పెట్రోల్‌ ట్యాంకు ఫుల్‌ చేయించమని డ్రైవర్‌కు చెప్పారు. అనంతరం పెట్రోల్‌ బంకు నిర్వాహకులు ఇచ్చిన బిల్లు చూసి కంగుతిన్నారు. కారు ఇంధన ట్యాంకు సామర్థ్యం 50 లీటర్లు ఉంటే.. 57 లీటర్లు పోసినట్లు చూపించడంతో అవాక్కయ్యారు.  హైకోర్టు న్యాయమూర్తి ఈ విషయాన్ని వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఆ పెట్రోల్‌ బంకును సీజ్‌ చేశారు. ఆ ప్రాంతంలోని ఇతర పెట్రోల్‌ బంకులూ ఈ తరహా మోసానికి పాల్పడుతున్నాయా? అనే విషయాన్ని గుర్తించేందుకు అన్నింటిని తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నలుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని