Child Labour: రోజుకు 14 గంటల పని.. చేతులపై కాలిన గాయాలు.. 58 మంది బాలకార్మికులకు విముక్తి!

మధ్యప్రదేశ్‌లోని ఓ మద్యం పరిశ్రమపై దాడి చేసిన అధికారులు.. అక్కడ పనిచేస్తున్న 58 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు.

Published : 16 Jun 2024 22:14 IST

భోపాల్: ఆడుతూ పాడుతూ.. బడిబాట పడుతూ.. సరదాగా సాగిపోవాల్సిన బాల్యం.. నిరంకుశ కోరల్లో చిక్కుకుపోయింది. రోజుకు 12-14 గంటల పని.. రసాయనాలు, ఆల్కహాల్‌ కారణంగా చేతులపై కాలిన గాయాలతో.. ఆ చిన్నారుల దుస్థితి దీనంగా మారింది. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని రాయ్‌సేన్‌ జిల్లాలో ఓ మద్యం పరిశ్రమపై దాడి చేసిన అధికారులు.. అక్కడ పనిచేస్తున్న 58 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. ఈ క్రమంలో అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ఎవరికీ అనుమానం రాకుండా ఆ పిల్లలను ఓ స్కూల్‌ బస్సులో పని ప్రదేశానికి తరలిస్తుండటం గమనార్హం.

బాలకార్మికులతో పనిచేయిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (NCPCR) అధికారులు, బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ (BBA) కార్యకర్తల బృందం ఓ డిస్టిలరీపై ఆకస్మిక దాడులు చేపట్టింది. ఈ క్రమంలో 58 మంది బాలకార్మికులను కాపాడింది. వారిలో 39 మంది బాలురు, 19 మంది బాలికలు ఉన్నారు. ‘‘ఆ పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. వారితో రోజుకు 12-14 గంటలు పనిచేయించేవారు. పరిశ్రమలోని రసాయనాలు, ఆల్కహాల్‌ గాఢత కారణంగా వారి చేతులకు కాలిన గాయాలయ్యాయి. కొందరి చర్మం ఒలిచినట్లు తయారయ్యింది. అక్కడ రసాయనాల ఘాటును భరించలేం. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో పిల్లలతో పనిచేయిస్తున్నారనేది ఊహించలేం. ఈ వ్యవహారం మానవ అక్రమ రవాణాతోనూ ముడిపడి ఉంది. కొంతమంది స్థానిక అధికారులు ఈ దారుణాలకు సహకరించినట్లు తెలుస్తోంది’’ అని ఎన్‌సీపీసీఆర్‌ ఛైర్మన్ ప్రియాంక్ కనుంగూ, బీబీఏ డైరెక్టర్ మనీశ్‌ శర్మ తెలిపారు.

ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్‌ రైల్వే వంతెనపై తొలి ట్రయల్‌ రన్‌.. వీడియో

ఈ ఘటనను ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాలతో జిల్లా ఎక్సైజ్‌ అధికారి, ముగ్గురు ఎస్సైలు సహా పలువురిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ కేసులో పరిశ్రమపై చర్యలు తీసుకున్నామని, వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, బాలల సంక్షేమ కమిటీ తదుపరి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితమే ఇదే జిల్లాలోని మూడు పరిశ్రమల నుంచి 36 మంది బాలకార్మికులకు ఎన్‌సీపీసీఆర్‌ విముక్తి కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని