Vaccine for Children: జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌.. 60 లక్షల డోసులు సిద్ధం!

సూది అవసరం లేకుండా దేశీయంగా అభివృద్ధి చేసిన జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ 60 లక్షల డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం

Published : 13 Oct 2021 21:40 IST

ఈ నెలలోనే పంపిణీకి సంస్థ సన్నాహాలు

 దిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మరో వ్యాక్సిన్ మార్కెట్‌లోకి రాబోతోంది. సూది అవసరం లేకుండా దేశీయంగా అభివృద్ధి చేసిన జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ 60 లక్షల డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి భారత ప్రభుత్వం ఆగస్టులోనే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ నెలలో జైడస్‌ క్యాడిలా 60 లక్షల డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ రూపొందించిన జైకోవ్‌-డి టీకా వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇవ్వడంతో డోసుల ఉత్పత్తిపై  దృష్టి సారించింది. డీఎన్‌ఏ సాంకేతికతతో అభివృద్ధి చేసిన జైడస్‌ క్యాడిలా మూడు డోసుల టీకాలను 0-28-56 వ్యవధిలో తీసుకోవాలి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన టీకాల్లో తొలి డీఎన్‌ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌ కూడా ఇదే కావడం విశేషం. అంతేకాకుండా 12-18 ఏళ్ల ఏళ్ల పైబడినవారిపైనా ఈ టీకా పని చేస్తుందని కంపెనీ గతంలోనే వెల్లడించింది. దీంతో భారత్‌లో చిన్నారులకు అందుబాటులోకి వచ్చే తొలిటీకా కూడా ఇదే కానుంది.

ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం అక్టోబర్‌లో 28 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందులో సీరం ఇనిస్టిట్యూట్‌ ఉత్పత్తి చేసే ‘కొవిషీల్డ్‌’ 22 కోట్ల డోసులు, భారత్‌ బయోటెక్‌ నుంచి ‘కొవాగ్జిన్’ 6 కోట్ల టీకా ఉత్పత్తులు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్‌లో 26 కోట్లకు పైగా టీకా డోసులను ఉత్పత్తి చేశారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 18 నాటికి 100 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ రోజునే కరోనా కట్టడికి కీలక పాత్ర పోషించిన ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లతో దేశవ్యాప్తంగా సంబరాలు చేయాలని యోచిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వేడుకలు నిర్వహిస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని