పాఠశాలకు వెళ్లిన 67 మంది విద్యార్థులకు కరోనా

కరోనా మహమ్మారి వ్యాప్తి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ ఒకటి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యే పాఠశాలలను పునఃప్రారంభించింది. అయితే పాఠశాలలు తిరిగి ప్రారంభమైన కొద్దిరోజులకే...

Published : 09 Nov 2020 02:02 IST

25 మంది సిబ్బందికి వైరస్‌

సిమ్లా: కరోనా మహమ్మారి వ్యాప్తి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ ఒకటి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యే పాఠశాలలను పునఃప్రారంభించింది. అయితే పాఠశాలలు తిరిగి ప్రారంభమైన కొద్దిరోజులకే కొవిడ్‌ కేసులు భారీగా బయటపడుతున్నాయి. మండి జిల్లాలోని టిబెటన్‌ చిల్డ్రన్‌ విలేజ్‌ (టీసీవీ) పాఠశాలలోని 67 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. 25 మంది సిబ్బందికి కూడా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. విద్యార్థుల్లో 47 మంది బాలికలు, 20 మంది బాలురు ఉన్నారు. పాఠశాల వద్ద కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా భారీగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.

అయితే వైరస్‌ సోకినవారంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారేనని ఓ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. పాజిటివ్‌గా తేలినవారంతా అరుణాచల్‌ప్రదేశ్‌, లద్ధాఖ్‌, మహారాష్ట్ర, నేపాల్‌ నుంచి అక్టోబర్‌ 25 నుంచి 31వ తేదీ మధ్య రాష్ట్రానికి వచ్చినట్లు అధికారి వెల్లడించారు. కాగా వైరస్‌ సోకిన విద్యార్థులతో పాటు సిబ్బందిని వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. అవసరమైతే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కి తరలిస్తామని అన్నారు. వైరస్‌ కట్టడికి రాష్ట్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని