Paramilitary Forces: ఆరేళ్లలో 680 మంది పారామిలిటరీ సిబ్బంది ఆత్మహత్య..!

కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్‌), అస్సాం రైఫిల్స్ నివేదికల ప్రకారం.. గడిచిన ఆరేళ్లలో పారామిలిటరీ దళాలకు చెందిన 680 మంది సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర హోంశాఖ వెల్లడిండింది.

Published : 05 Aug 2021 01:52 IST

దిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్‌), అస్సాం రైఫిల్స్ నివేదికల ప్రకారం.. గడిచిన ఆరేళ్లలో పారామిలిటరీ దళాలకు చెందిన 680 మంది సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర హోంశాఖ వెల్లడిండింది. ‘‘గత ఆరేళ్లలో 700 మందికిపైగా పారామిలిటరీ సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడినట్టు వస్తున్న వార్తలకు సంబంధించి వాస్తవాలను వెల్లడించాలంటూ రాజ్యసభలో హోంశాఖను భాజపా ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోదీ లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఈ మేరకు బదులిచ్చారు. ఇదే వ్యవధిలో ప్రమాదాల కారణంగా 1,764 మంది, ఎదురుకాల్పుల్లో 323 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. వారి ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలు, అనారోగ్యం, ఆర్థిక సమస్యలు కారణాలు కావచ్చంటూ ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రొఫెషనల్‌ ఏజెన్సీల సహాయంతో సమీక్షిస్తూనే ఉందని తెలిపారు. బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని దృష్టిలో పెట్టుకొని వారిలో మానసిక ఒత్తిడికి కారణాలపై పోలీసు పరిశోధన, అభివృద్ధివిభాగం 2004లో అధ్యయనం చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. అహ్మదాబాద్‌ ఐఐఎమ్‌ కూడా 2012లో ఇదే తరహా అధ్యయనం చేసినట్లు వివరించారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని