భారత్‌లో 69% కొత్త కేసులు ఇక్కడే!

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ చలికాలంలో వైరస్‌ వ్యాప్తి క్రమంగా మళ్లీ పుంజుకుంటోంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 41,452 కొత్త కేసులు, 615 మరణాలు నమోదయ్యాయి. అయితే, కరోనా తీవ్రత దేశంలోని..........

Updated : 28 Nov 2020 15:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ చలికాలంలో వైరస్‌ వ్యాప్తి క్రమంగా మళ్లీ పుంజుకుంటోంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 41,452 కొత్త కేసులు, 615 మరణాలు నమోదయ్యాయి. అయితే, కరోనా తీవ్రత దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో మహారాష్ట్ర, దిల్లీ, కేరళ, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌లలోనే అధికం. తాజాగా మహారాష్ట్రలో 6185 కొత్త కేసులు రాగా.. దిల్లీలో 5482, కేరళలో 3966 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

ప్రతి మిలియన్‌ జనాభాకు లక్ష టెస్ట్‌లు!

మరోవైపు, దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యం కూడా క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 11,57,605 మందికి కొవిడ్ నిర్దారణ పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,161 టెస్టింగ్‌ ల్యాబోరేటరీల్లో (1,175 ప్రభుత్వ, 986 ప్రైవేటు ల్యాబ్‌లు) 13.82 కోట్ల మందికి పరీక్షలు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, ప్రతి మిలియన్‌‌ జనాభాకు గాను లక్ష టెస్ట్‌ల మార్కును దాటింది. ప్రతి మిలియన్‌ జనాభాలో కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణ జాతీయ సగటు కన్నా 23 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్టు కేంద్ర గణాంకాలు సూచిస్తున్నాయి. అలాగే, 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కన్నా తక్కువగా నమోదైంది. 

రికవరీ రేటు 93.68%

ఇక రికవరీల విషయానికి వస్తే.. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 87,59,969 మంది కొవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 93.68 శాతంగా ఉంది. గడిచిన 24గంటల్లోనే 41,452మంది రికవరీ అయినట్టు గణాంకాలు పేర్కొన్నాయి. శుక్రవారం దిల్లీలో 5,937మంది డిశ్ఛార్జి అయ్యారు. కేరళలో ఈ సంఖ్య 4,544గా ఉండగా.. మహారాష్ట్రలో 4,089గా ఉంది.

10 రాష్ట్రాల్లోనే 78.5% కొత్త మరణాలు 

దేశంలో కొవిడ్‌ బారిన పడి నిన్న ఒక్కరోజే 615 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు నమోదైన మృతుల సంఖ్య 1,36,200కి పెరిగింది. అయితే, కొత్తగా నమోదైన మరణాల్లో 615 మరణాల్లో 485 కొవిడ్‌ మరణాలు (78.5శాతం) కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. నిన్న దిల్లీలో అత్యధికంగా 98 మరణించగా.. మహారాష్ట్రలో 85 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మన దేశంలో 4,54,940 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని