Indigo: ‘అత్యవసర ఫ్రీక్వెన్సీ’లో పైలట్‌ల తిట్ల పురాణం! డీజీసీఏ విచారణ షురూ

విమానాల్లో అత్యవసర పరిస్థితుల్లో సమాచార మార్పిడి కోసం ఉపయోగించే ఫ్రీక్వెన్సీ(121.5 మెగాహెర్ట్జ్‌)ని దుర్వినియోగం చేసినట్లు ఏడుగురు  పైలట్‌లపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వేతనాల విషయంలో ఏప్రిల్ 9న వారు ఈ ఫ్రీక్వెన్సీలో...

Published : 29 Apr 2022 02:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విమానాల్లో అత్యవసర పరిస్థితుల్లో సమాచార మార్పిడి కోసం ఉపయోగించే ఫ్రీక్వెన్సీ(121.5 మెగాహెర్ట్జ్‌)ని దుర్వినియోగం చేసినట్లు ఒక ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏడుగురు పైలట్‌లపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వేతనాల విషయంలో ఏప్రిల్ 9న వారు ఈ ఫ్రీక్వెన్సీలో అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు తాజాగా సంబంధిత వర్గాలు తెలిపాయి. తక్కువ జీతాలపై అభ్యంతరకర మాటలతో వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు వెల్లడించాయి. సాధారణంగా ఈ ఫ్రీక్వెన్సీని.. విమానం ఆపదలో ఉన్న సమయంలో మాత్రమే అత్యవసర సమాచార మార్పిడికి ఉపయోగిస్తారు. దీంతో.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించింది. మరోవైపు, ఇండిగో సంస్థ ఈ ఉదంతంపై ఇంకా ప్రకటన విడుదల చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎమర్జెన్సీ కమ్యూనికేషన్స్‌ కోసం ఉపయోగించే ఈ 121.5 మెగాహెర్ట్జ్‌ ఫ్రీక్వెన్సీని.. విమానం సమీపంలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌లు తప్పనిసరిగా పర్యవేక్షించాలి. ఇదిలా ఉండగా.. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే.. కొవిడ్‌ సమయంలో విధించిన వేతన కోతలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5న సమ్మె చేయాలని భావించిన కొంతమంది పైలట్‌లను సంస్థ సస్పెండ్ చేయడం గమనార్హం. కరోనా ఉద్ధృత సమయంలో.. ఈ విమానయాన సంస్థ తమ పైలట్‌ల జీతాల్లో 30 శాతం వరకు కోత విధించింది. అయితే, ఏప్రిల్ 1న వారి వేతనాలను ఎనిమిది శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతా బాగుంటే నవంబర్‌లో మరో 6.5 శాతం పెంపును అమలు చేస్తామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని